యూపీలో వల కార్మికుల్ని చితగ్గొట్టారు పోలీసులు. హర్యానాలో సామాన్లు, సైకిళ్లు వదిలి పారిపోయేలా చావబాదారు. ఉత్తరాది రాష్ట్రాల్లో వలస కూలీలు అత్యంత దయనీయ పరిస్థితుల్లో రోడ్డున నడిచి వెళ్తున్నారు. రైలు పట్టాలపై వెళ్తూ ప్రాణాలు కోల్పోతున్నారు, రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. మరికొందరు ఆకలితో చచ్చిపోతున్నారు. వలసల వెతల్ని స్థానిక ప్రభుత్వాలు పట్టించుకోనే లేదు. కానీ ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు.
ముఖ్యమంత్రి పిలుపుతో ఎక్కడికక్కడ వలస కార్మికులను అధికారులు ఆదుకుంటున్నారు. తిండి పెట్టి, జత చెప్పులు కొనిచ్చి, దారిలో వెళ్లేటప్పుడు తినడానికి ఇంకో పార్సిల్ ఇచ్చి మరీ పంపుతున్నారు. ఇప్పటివరకూ స్థానిక నేతలు పేదలకు నిత్యావసరాలిచ్చి ఆదుకుంటే, ఇప్పుడు అధికారులు వలసకూలీల పాలిట దేవుళ్లుగా మారారు. సీఎం ఆదేశాలతో రాష్ట్రంలోని రోడ్డు పొడవునా ఇలాంటి సేవా కార్యక్రమాలే కనపడుతున్నాయి.
సరిహద్దులు దాటి ఏపీలో ప్రవేశించిన వెంటనే వారికి అన్నపానీయాలు అందజేస్తున్నారు. దూర ప్రయాణాలు చేసే వారిని సరిహద్దులు దాటించేందుకు వాహనాల ఏర్పాట్లు చేస్తున్నారు. పైసా ఖర్చులేకుండా రాష్ట్రం దాటిస్తున్నారు. అవసరం అనుకున్న వాళ్లకు ప్రాధమిక వైద్య పరీక్షలు కూడా అక్కడికక్కడే నిర్వహిస్తున్నారు.
ఏపీలో కార్మికులకు అందుతున్న సౌకర్యాలపై జాతీయ మీడియా కూడా దృష్టిపెట్టింది. అటు సోషల్ మీడియాలో కూడా జగన్ ప్రభుత్వంపై ప్రశంసలు వెల్లువెత్తాయి. సొంత రాష్ట్రం ప్రజలను ఆదుకోడానికే అవస్థలు పడుతున్న రోజులివి, సాయం చేయాలంటే ఓటుతో లింకు పెట్టే కాలమిది. అలాంటి సమయంలో కూడా పొరుగు రాష్ట్రాలవారికి సాయం చేస్తూ పెద్దమనసు చాటుకున్నారు జగన్.
ముఖ్యమంత్రి చొరవతో అందుతున్న సహాయానికి ఇరుగు పొరుగు రాష్ట్రాల ప్రజలు ఏపీలో పుడితే ఎంత బాగుండేదో అనుకుంటున్నారంటే మిగతా రాష్ట్రాల్లో వారికి ఎదురైన చేదు అనుభవాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మొత్తమ్మీద జగన్ నిర్ణయం మరోసారి దేశానికే ఆదర్శంలా నిలిచారు. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు ఇటు తిరిగి చూసేలా చేశారు.