గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1533 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 17,265కు చేరింది. నిన్న ఒక్క రోజే దేశంలో కరోనా కారణంగా 36 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 543కు చేరింది. ప్రస్తుతం 2547 మంది కోలుకోగా.. 14,175 మందికి ట్రీట్ మెంట్ జరుగుతోంది.
దేశంలో అత్యథికంగా కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ఈరోజు ఉదయం 8 గంటల నాటికి ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 4203గా ఉంది. ఇప్పటివరకు 223 మంది చనిపోయారు. ఇక మహారాష్ట్ర తర్వాత అత్యథికంగా ఢిల్లీలో 2003 పాజిటివ్ కేసులున్నట్టు కేంద్రం ప్రకటించింది. తర్వాత స్థానాల్లో గుజరాత్ (1743), రాజస్థాన్ (1478), తమిళనాడు (1477) ఉన్నాయి.
మరణాల పరంగా చూసుకుంటే.. మహారాష్ట్ర తర్వాత మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాలున్నాయి. మహారాష్ట్రలో 223 మంది చనిపోగా.. మధ్యప్రదేశ్ లో 70, గుజరాత్ లో 63, ఢిల్లీలో 45 మంది మరణించారు.
ఇక ఈరోజు నుంచి ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్ డౌన్ నుంచి అన్ని రాష్ట్రాలకు కొన్ని మినహాయింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కేసుల తీవ్రత దృష్ట్యా తాము మాత్రం లాక్ డౌన్ ను కొనసాగిస్తామని తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్ ప్రకటించాయి.