భారతదేశంలో లాక్ డౌన్ మే మూడో తేదీ వరకు పొడిగించారు. దీనిని కాదని ఎవరం చెప్పలేం. భారత దేశం ఈ నిరంతర లాక్‌డౌన్‌ను తట్టుకోగలుగుతుందా? అన్నది మాత్రం కచ్చితంగా చర్చ అవుతుంది. అనేక దేశాలతో, అందులో అగ్రదేశాలతో పోల్చితే మనం బెటర్ పొజిషన్‌లో ఉన్నందుకు సంతోషించాల్సిందే. అందుకు ప్రధాని నరేంద్రమోడీని కాని, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కాని అభినందించవలసిందే.
ప్రజలకు వెయ్యో, ఐదువందల చొప్పునో, మరికొంతో ఆర్థిక సాయం చేశారు. బియ్యం సరఫరా చేశారు. ఇవన్ని ఓకే. కాని అవి సరిపోతాయా? ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు. ఇకపై జరిగేది ఒకఎత్తు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాలను రక్షించాలి. అది ప్రధాన బాధ్యత. ప్రథమ కర్తవ్యం. అందులో ఎవరికి సందేహం అవసరం లేదు. కాని అదే సమయంలో మొత్తం ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయి. ఎవరికి పని లేని పరిస్థితి.. చేతిలో ఉన్న డబ్బులు అయిపోయే పరిణామ క్రమం. ఉద్యోగాలు ఉంటాయో, ఊడతాయో చెప్పలేని అగమ్య గోచర పరిస్థితి.
మోడీ ప్రజల త్యాగాలను, కష్టాలను బాగానే గుర్తించారు. ఆ విషయాలను ప్రముఖంగానే ప్రస్తావించారు. ప్రజలు సురక్షితంగా ఉండడానికి ఏడు సూత్రాలు పాటించాలని అన్నారు. వాటిలో సామాజిక దూరం మొదలు మాస్కుల దరించడం వరకు ఉన్నాయి. అదే సమయం ఓ ప్రైవేటు సంస్థలలో ఎవరిని ఉద్యోగాల నుంచి తొలగించవద్దన్న సూచన కూడా ఉంది. కాని అది ఎంతవరకు ఆచరణ సాధ్యమన్నది ప్రశ్నార్ధకం. పారిశ్రామికవేత్తలు ఎవరూ దీనిపై సంతోషంగా లేరంటే అతిశయోక్తి కాదు.
నిజమే పరిశ్రమల వారు బాగా సంపాదించుకుంటే, అందులో కొంత ఖర్చు పెట్టలేరా అన్న వాదన కూడా వస్తుంది. ఆ రకంగా కొందరు చేయవచ్చు కూడా. కాని ఇప్పటికే నష్టాలలో ఉండి, అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంస్థల పరిస్థితి ఏమిటి?
ప్రభుత్వాలే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతే, సగం జీతం ఇచ్చి సరిపెట్టుకోమంటే, పూర్తి జీతం కట్ చేస్తే, ప్రైవేటు సంస్థలు కూడా కొంతవరకు ఆ బాటలోనే నడిచినా, ఆర్థికంగా వెసులు బాటు లేకపోతే ఉద్యోగాలు తీసివేయక తప్పదు. ఇప్పటికే పేద, దిగువ మధ్య తరగతి వారికి ఈ సమస్య మొదలైంది. ఐటీ రంగంలో సైతం లక్షలాది ఉద్యోగాలు పోతాయని భయపడుతున్నారు. మరో పది, పదిహేను రోజుల్లో ప్రభుత్వాలు జీతాలు ఇవ్వవలసి ఉంటుంది. మరి ఏ ప్రభుత్వం ఎలా జీతం చెల్లిస్తుంది? బహుశా కేంద్రం ఏమైనా పాే్యకజీ ఇస్తుందా? అన్న ఆశ వారిలో ఉండవచ్చు. నిజంగానే కేంద్రం, ప్రధాని మోడీ ఆ దిశగా ఆలోచించి ఆర్థికంగా ఆదుకుంటే అంతా అభినందిస్తారు. కాని దానివల్ల వచ్చే కొన్ని ఆర్థిక దుష్పరిణామాలకు భయపడి పాే్యకజీ ఇవ్వకపోతే రాష్ట్రాలు దివాళా తీసే పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రపంచంలోని ఆయా అనుభవాలను పురస్కరించుకుని చెప్పినట్లు హెలికాప్టర్ మనీ స్కీమ్‌ను అమలు చేస్తారా? లేక రాష్ట్రాలకు ఇతోదికంగా రుణాలు ఇస్తారా? అన్నది చూడాల్సి ఉంటుంది. అలాగే ప్రైవేటు రంగంలో ఉపాధి కోల్పోయినవారిని ఏమి చేస్తారు? చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, ఉదాహరణకు లక్షలాది చిన్నహోటల్, తినుబండారాల షాపులు మూతపడ్డాయి. వాటిలో నలుగురైదురుగు పనిచేస్తుంటారు. అవన్ని దెబ్బతింటే వారు ఏమి చేయాలి? పెద్దస్టార్హోటల్ రవాణా రంగం అవి విమానాలు కావచ్చు. బస్‌లు కావచ్చు.. అన్ని నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాయి. ఇవేవి మోడీకి, కేంద్రానికి తెలియవని కాదు. గొప్ప, గొప్ప ఆర్థిక వేత్తలు వారికి సలహాలు ఇస్తుండవచ్చు. కాని ఒక సామాన్యుడిగా మోడీ నుంచి ఆశించింది దేశ ప్రజల ఆరోగ్యానికి భరోసాతో పాటు ఆర్ధిక రక్షణకు బరోసా ఇస్తారని. ఆర్థిక రక్షణ గురించి ఆయన ఒక్క మాట కూడా చెప్పలేదు.
కొన్ని దేశాలలో ప్రైవేటు కంపెనీల, సంస్థల ఉద్యోగుల జీతాలను ప్రభుత్వమే కొంత మేర బరిస్తున్నాయట. అలాంటి ఆలోచనలు ఇక్కడ కూడా జరగాలి. రైతుల పంటలను కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు నానా పాట్లు పడుతున్నాయి. కేంద్రం నుంచి ఇప్పటికే ఐదు కోట్ల రూపాయల బాకీ ఉందని ఏపీ మంత్రి కొడాలి నాని చెప్పారు. ఆ డబ్బు రాకపోతే ఏపీ ప్రభుత్వం ఏమి చేయాలి. ఉద్యాన పంటల పరిస్థితి దయనీయంగా మారింది. ఆక్వారంగం ఉజ్వలంగా ఉండాల్సిన సమయంలో ఉసూరు మంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎగుమతులకు, రవాణాకు ఎన్ని చర్యలు తీసుకున్నా, ఇతర రాష్ట్రాలలో వాటి విక్రయాలకు అవకాశం వచ్చే వరకు పెద్దఎత్తున ఇతర దేశాలకు అనుమతులు లభించే వరకు ఇబ్బందులు పడవలసిందే. అలాంటి వారిని కూడా ఆదుకోవల్సిందే.
ఇక సాధారణ కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఒకటి వారిది బౌతిక సమస్య. మరొకటి మానసిక సమస్య. ప్రపంచ చరిత్రలో సరియా తదితర దేశాల నుంచి లక్షల మంది యూరప్‌లోని పలు దేశాలకు చిన్న, చెన్న తెప్పలలో, పడవలలో సుదూరం సముంద్రంలో ప్రయాణం చేసి వెళ్లారన్న వార్తలు చూసి అంతా బాధపడ్డాం. వారిలో కొంత మంది సముద్రం పాలయ్యారు. మరికొందరు ఆయా దేశాల సరిహద్దులలో పడిగాపులు పడి నానా యాతన అనుభవించారు. అంతదారుణమైన సన్నివేశాలతో మనం పోల్చకపోయినా, భారత దేశంలో ఐదులక్షల మందికి పైగా వలస కార్మికులు తమ స్వరాష్ట్రాలకు కాలి నడకన బయల్దేరిన సన్నివేశాలు అందరి హదయాలను కలచివేశాయి. ఇక్కడ వారు స్వస్థలాలకు చేరి ఉండవచ్చు. లేదా మధ్యలో ఆపివేస్తే ఎక్కడ వారు అక్కడ ఉండవచ్చు. వారికి భోజన సదుపాయాలు కల్పించి ఉండవచ్చు. కాని భారతదేశం ఇన్నేళ్ల స్వాతంత్రం తర్వాత ఈ పరిస్థితిలో ఉందా అన్న ఆవేదన మాత్రం కలుగుతుంది.
మోడీ ముందస్తు జాగ్రత్తలు లేకుండా లాక్‌డౌన్ ప్రకటించారా? లేక అత్యవసరంగా ప్రకటించారా? అన్న విషయాల గురించి ఇప్పుడు చర్చించి ఉపయోగం లేదు. కాని మరోసారి లాక్‌డౌన్ పొడిగింపు ప్రకటన చేసిన తర్వాత వందలు, వేల సంఖ్యలో వలస కార్మికులుమళ్లీ పిల్లా, జల్లా వెంటబెట్టుకుని, తట్లా, బుట్టా నెత్తిన పెట్టుకుని బయల్దేరిన వైనం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సొంత ప్రదేశాలలో తమ వాళ్లు ఎలా ఉన్నారో అన్న మానసిక వేదన, నగరాలలో ఖర్చులు ఎలా భరించగలమన్న ప్రశ్న. వారికి భవిత గురించి ఆలోచన లేదు. కేవలం మానసిక ఒత్తిడితో వందల కిలోమీటర్లు నడవడానికి సిద్ధపడ్డారంటే పరిస్థితి అర్ధం చేసుకోవాలి. మొదట లాక్‌డౌన్‌ను అంతా సమర్థించారు. ఎక్కడివారు అక్కడే ఉండాలని అనుకున్నారు. ఈ ఇరవై రోజులలో అన్ని సర్దుకుని మళ్లీ యదా జీవనం ఏర్పడుతుందని అనుకున్నారు. కాని అలా జరగడం లేదు.
ఏప్రిల్ ఇరవై తర్వాత కొన్ని సడలింపులు ఇస్తామని అంటున్నారు. మే మూడు వరకు లాక్ డౌన్ తప్పదని అంటున్నారు. పోనీ మే మూడు తర్వాత కరోనా సమస్య ఆగిపోతుందా? అన్న ప్రశ్నకు జవాబు దొరకడం లేదు. అక్కడక్కడా కొన్ని ప్రదేశాలు లాక్‌డౌన్ అయితేనే చాలా కష్టాలు ఉంటాయి. అలాంటిది దేశం అంతా లాక్‌డౌన్ అయితే మొత్తం జనజీవితమే స్తంభిస్తుంది. ఇప్పుడు మన దేశం ఆ సమస్యను ఎదుర్కొంటోంది. ప్రజల ప్రాణాలను కాపాడవలసిందే. కాని అదే సమయంలో ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి ఏమి చేయాలన్నదానిపై ఇంకా దష్టి పెట్టపోతే దేశ వ్యాప్తంగా ఎన్నో అలజడులు చెలరేగే ప్రమాదం ఉంటుంది. శాంతి భద్రతల సమస్యలు రావచ్చు. ఇంకా అనేక సమస్యలు వస్తాయి. అవేవి రావాలని ప్రధాని కాని, ముఖ్యమంత్రులు కాని కోరుకోరు.
దేశం సురక్షితంగా ఉండాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని మోడీ అయినా మరెవరైనా ఆకాంక్షిస్తారు. కాని ఆ క్రమంలో వారు అనుకున్నట్లు దేశం నడవాలంటే మోడీగారే అన్నట్లు బతుకు ముఖ్యమే. బతుకు బండి ముఖ్యమే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వాలైనా ప్రజల బతుకు బండిపై కూడా గట్టిగా దష్టి పెట్టవలసిన సమయం అసన్నమైందని చెప్పక తప్పదు. భవిష్యత్తులో ఇలాంటి సన్నివేశాలను కోరుకోం. కాని అలాంటివి ఎదురైతే ఏమి చేయాలన్నదానిపై సమగ్ర వ్యూహాలు కూడా సిద్ధం చేసుకోవల్సి ఉంటుంది.
కొమ్మినేని శ్రీనివాసరావు