లాక్ డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థమైంది. దీంతో కరోనా ప్రభావం అంతగా లేని ప్రాంతాల్లో కొన్ని మినహాయింపులిచ్చింది కేంద్రం. ఈరోజు నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆంక్షలు సడలించింది. అయితే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఒకలా, తెలంగాణ దానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు నుంచి కొన్నింటికి మినహాయింపులు ఇచ్చారు. కిరాణ దుకాణాలు, మెడికల్ షాపులు తెరుస్తారు. బ్యాంకులు, పోస్టాఫీసులు, పెట్రోల్ బంకులు తెరుచుకుంటాయి. కొన్ని ప్రాంతాల్లో సూపర్ మార్కెట్లకు కూడా అనుమతులిచ్చారు. కూరగాయలు, పాల దుకాణాలతో పాటు చికెన్-మటన్-చేపల మార్కెట్లు కూడా తెరుకుంటాయి.
అదే సమయంలో టీ-టిఫినె సెంటర్లు, సెలూన్లు, పాఠశాలలు, బట్టల దుకాణాలు, విద్యా సంస్థలు మూసే ఉంటాయని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే రెడ్ జోన్ల విషయంలో మాత్రం ప్రభుత్వం ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు. సరికదా పూర్తిస్థాయిలో కర్ఫ్యూను కూడా అమల్లోకి తీసుకొచ్చింది. ప్రతి ఇంటికి పోలీసులు, రెవెన్యూ సిబ్బందే సరుకులు అందజేస్తున్నారు. ఎవ్వర్నీ ఇళ్ల నుంచి బయటకు రానివ్వడం లేదు.
అయితే ఇటు తెలంగాణలో మాత్రం ఇలా రెండు రకాలుగా వ్యవహరించకూడదని నిర్ణయించారు ముఖ్యమంత్రి కేసీఆర్. అంతా ఊహించినట్టుగానే ఎలాంటి మినహాయింపులు లేకుండా లాక్ డౌన్ ను కొనసాగించాలని నిర్ణయించారు. పైపెచ్చు లాక్ డౌన్ గడువును కూడా పొడిగించారు. కేంద్రం చెప్పినట్టు మే 3 వరకు కాకుండా.. మే 7వరకు పూర్తిస్థాయిలో లాక్ డౌన్ ను కొనసాగిస్తామని స్పష్టంచేశారు. అంతేకాదు.. ఇవాళ్టి నుంచి కర్ఫ్యూ టైమింగ్స్ ను కూడా పొడిగిస్తున్నట్టు ప్రకటించారు.
తెలంగాణలో కరోనాను అరికట్టాలంటే ఇంతకుమించి మార్గం లేదన్నారు కేసీఆర్. ఓవైపు ఆదాయం పూర్తిగా పడిపోయినప్పటికీ ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదన్నారు. అటు వేతనాల్లో కోతలు కూడా కొనసాగుతాయని స్పష్టంచేశారు. ఇంతకుముందు ప్రకటించిన శాఖల్లోనే కోతలు ఉంటాయని తెలిపిన ముఖ్యమంత్రి.. పోలీసులకు మాత్రం అదనంగా 10శాతం జీతం ఇచ్చి వాళ్లను ప్రోత్సహించారు.
ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. గత నెలలో రాష్ట్ర ఖజానాకు 6వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది. ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో రెవెన్యూ మెల్లమెల్లగా జనరేట్ అవుతుందని భావిస్తున్నారు. ఇటు తెలంగాణలో మాత్రం ప్రభుత్వ బాండ్లను విక్రయించి ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం నుంచి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ వస్తే తప్ప రాష్ట్రాల మనుగడ అసాధ్యంగా మారింది.