ప్రపంచం మొత్తం కరోనాతో అతలాకుతలం అవుతోంది. దేశం కూడా కరోనా ధాటికి విలవిల్లాడుతోంది. రాష్ట్రం కూడా కరోనా దెబ్బకు కుదేలైంది. ఇంత సంక్షోభంలో కూడా శ్రీకాకుళం జిల్లా మెరిసింది. ఆ జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్ కూడా నమోదు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు ఘనంగా చాటుకుంటూ వస్తోంది. ఇప్పుడీ ఘనతను జిల్లాకు దక్కకుండా చేస్తున్నారు కొందరు మూర్ఖులు.
అవును.. శ్రీకాకుళం జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యే ప్రమాదం పొంచి ఉంది. దీనికి కారణం ఓ వలస కూలి. గుంటూరులోని మిర్చి యార్డ్ లో ఇతడు కూలీగా పనిచేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా అంతా స్తంభించిపోవడంతో ఎలాగైనా తన స్వగ్రామం చేరుకోవాలని భావించాడు. దీంతో కొంత దూరం లారీల్లో, మరికొంత దూరం దారిలో లిఫ్ట్ అడిగి, ఇంకొంత దూరం నడిచి ఎలాగోలా గమ్యస్థానం చేరుకున్నాడు. కానీ అప్పటికే అతడికి తీవ్రమైన జ్వరం, దగ్గు ఉన్నాయి.
గుంటూరులోని రెడ్ జోన్ నుంచి తప్పించుకొని, శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం కొఠారిపురం గ్రామానికి చేరుకున్న ఈ వ్యక్తిని స్థానికులు గ్రామంలోకి రానివ్వలేదు. పైగా ఇతడి ఆరోగ్య పరిస్థితి కూడా అనుమానాస్పదంగా ఉండడంతో వెంటనే రాజాంలోని ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకెళ్లారు స్థానిక గ్రామ వాలంటీర్లు. అక్కడ్నుంచి నేరుగా శ్రీకాకుళం జిల్లా హాస్పిటల్ లోని ఐసొలేషన్ వార్డుకు తరలించారు. రెడ్ జోన్ నుంచి రావడం, పైగా కరోనా లక్షణాలు కూడా ఉండడంతో.. ఇతడికి కచ్చితంగా పాజిటివ్ వస్తుందని రాజాం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
మరోవైపు ఇదే జిల్లాకు చెన్నై నుంచి రహస్యంగా కొంతమంది మత్స్యకారులు చేరుకున్నారు. ఉపాథి కోసం తమిళనాడు వెళ్లిన మత్య్యకారులు లాక్ డౌన్ కారణంగా చెన్నైలో చిక్కుకుపోయారు. కానీ వీళ్లు అక్కడే ఉండకుండా.. సముద్ర మార్గంలో శ్రీకాకుళం రావాలని ప్లాన్ చేశారు. అనుకున్నట్టుగానే ఓ బోటుపై సముద్రమార్గంలో వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం ఇద్దవానిపాలెం సమద్ర తీరానికి చేరుకున్నారు.
విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో ఎవ్వర్నీ కలవనీయకుండా దగ్గర్లో ఉన్న క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. వీళ్లు కూడా చెన్నైలోని హాట్ స్పాట్ నుంచే తప్పించుకొని వచ్చారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈరోజు వీళ్ల నుంచి శాంపిల్స్ తీసుకొని పరీక్షిస్తారు. వీళ్లలో కూడా కొంతమంది జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారని పోలీసులు చెబుతున్నారు.