కరోనా వైరస్ కు సంబంధించిన నంబర్లలో వేగవంతమైన మార్పు కనిపిస్తోందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. అయితే కరోనా భయంతో చాలా వరకూ ప్రపంచం లాక్ డౌన్ అయ్యింది. అయినప్పటికీ కరోనా వ్యాప్తి మాత్రం కొనసాగుతూ ఉందని గణాంకాలు చెబుతున్నాయి. మన దేశం ఇప్పటికే లాక్ డౌన్ అయ్యింది. ఈ నేపథ్యంలో కూడా కొన్ని కేసులు రిజిస్టర్ అవుతూ ఉండటం గమనార్హం. సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ లెక్కల ప్రకారం.. దేశంలో కరోనా కేసుల సంఖ్య దాదాపు 562. అయితే వీరిలో 40 మందికి చికిత్సను అందించి నయం చేశారు. పది మంది చనిపోయారు. మిగిలిన వారు చికిత్స పొందుతూ ఉన్నారు.
రాష్ట్రాల వారీగా చూస్తే.. ఈ విషయంలో కేరళ, మహారాష్ట్రలు తొలి స్థానాల్లో ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య వందను దాటింది. కేరళలో 109 కేసులు రిజిస్టర్ కాగా, మహారాష్ట్రలో 101 కేసులు నమోదయినట్టుగా వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
కర్ణాటకలో కూడా కరోనా కేసుల సంఖ్యలో పెంపుదల కనిపిస్తూ ఉంది. అక్కడ 46 మందిని గుర్తించినట్టుగా సమాచారం. ఆ తర్వాత తెలంగాణలోనూ 35 కరోనా కేసులు రిజిస్టర్ అయ్యాయి. వీరిలో పది మంది విదేశీయులున్నారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఢిల్లీల్లో ముప్పైకి పై స్థాయి చొప్పున కరోనా కేసులు రిజిస్టర్ అయ్యాయి. తమిళనాట కరోనా ప్రభావం స్వల్ప స్థాయిలో పెరిగింది. 18 కేసులు నమోదు అయినట్టుగా సమాచారం.
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇప్పటి వరకూ తొమ్మిది కేసులు రిజిస్టర్ అయినట్టుగా కేంద్ర వైద్య శాఖ ప్రకటించింది. లాక్ డౌన్ నేపథ్యంలో కొత్త కేసుల రిజిస్టరీ తగ్గితే… కరోనాపై భారత్ విజయం సాధిస్తున్నట్టే.