కరోనా మహమ్మారి కంటే, దాని వల్ల ఆస్పత్రిలో చికిత్సకయ్యే ఖర్చుకే జనం ఆందోళన చెందుతున్నారు. మహమ్మారి ఒక రకంగా దెబ్బతీస్తే, కార్పొరేట్ ట్రీట్ మొత్తం కుటుంబాలకు కుటుంబాలనే ఆర్థికంగా విధ్వంసం చేస్తున్నాయి. ఈ విషయమై స్వయంగా న్యాయ స్థానాలే జోక్యం చేసుకుని ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని అరికట్టాలని ఆదేశిస్తున్నా తగిన ఫలితాలు దక్కడం లేదు.
లక్షలకు లక్షలు ఖర్చు అవుతున్నా చివరికి శవాన్ని చేతికి అప్పగించిన, అప్పగిస్తున్న ఆస్పత్రుల గురించి మీడియాలో కథలు కథలుగా వింటున్నాం, చూస్తున్నాం. కరోనా ఫస్ట్ వేవ్‌తో పోల్చుకంటే సెకెండ్ వేవ్‌లో మరణాల సంఖ్య రెట్టింపైంది. కరోనా సెకెండ్ వేవ్‌లో మహమ్మారి బారిన పడిన రెండుమూడు రోజులకే ఊపిరితిత్తులపై అటాక్ చేస్తోంది. దీంతో శ్వాస సమస్యలు తలెత్తడం, చివరికి మరణానికి దారి తీస్తోంది.
అందులోనూ ఆక్సిజన్ బెడ్స్‌కు బాగా డిమాండ్ పెరిగింది. రోగుల ఆందోళనను, ఆక్సిజన్ బెడ్ డిమాండ్‌ను కార్పొరేట్ ఆస్పత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. ఇది అది అనే తేడా లేకుండా ప్రతి ప్రైవేట్ ఆస్పత్రి కరోనా బాధిత కుటుంబాలను పీల్చి పిప్పి చేసేందుకు వెనుకాడలేదు.
తిరుపతి, కడప, కర్నూలు రాజమండ్రి, భీమవరం లాంటి చోట్ల రోజుకు రూ.50 వేలకు తక్కువ కాకుండా కరోనా రోగి నుంచి ఆస్పత్రులు వసూలు చేస్తున్నాయి. ఇక విజయవాడ, గుంటూరు, హైదరాబద్ లాంటి చోట్ల రోజుకు రూ.95 వేల పైమాటే. దీంతో పది రోజులు పెట్టుకుంటే సులభంగా రూ.10 లక్షల ఆస్పత్రి బిల్లులు వేసి పంపిస్తున్నారు.
ముందు మనిషి బతికి ఉంటే, ఆ తర్వాత ఏదో ఒకటి చేసుకుని బతుకొచ్చనే ఆశతో ఉన్న అరకొర ఆస్తులమ్ముకునో, అప్పులు చేసో తమ వారిని కరోనా మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుండడం చూస్తున్నాం. ఈ క్రమంలో కొన్ని కుటుంబాలు రూ.50 లక్షలు, రూ.60 లక్షలు కూడా ఖర్చు చేయాల్సి వచ్చింది.
ఆర్థికంగా స్థితిమంతులైతే ఖర్చు చేయడానికి వెనుకాడరు. కానీ ఎంత మందికి రూ.2 లక్షలకు మించి వైద్యానికి భరించే శక్తి ఉంటుంది? గుడ్డిలో మెల్ల మాదిరిగా ఏపీలో కొంత మెరుగే. ప్రైవేట్ ఆస్పత్రులపై కొద్దోగొప్పో ఉక్కుపాదం మోపారు. అయినప్పటికీ ప్రైవేట్ ఆస్పత్రులు జలగల్లా పీల్చి పిప్పు చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆడపిల్లల పెళ్లిళ్లు, పిల్లల చదువు కోసం దాచుకున్న సొమ్ము హారతి కర్పూరంలా కరిగిపోయింది.
భారీ మొత్తంలో ఖర్చు చేసుకున్నా మనిషి దక్కని వారి కుటుంబాల గోడు వర్ణనాతీతం. అప్పులపాలైనా కనీసం మనిషి మిగిలాడని మరికొందరు సంతృప్తి పడుతున్నారు. ఏది ఏమైనా కరోనా మహమ్మారి మిగిలిన శోకం అంతాఇంతా కాదు. ఆ బాధ, ఆవేదన అనుభవించిన వారికే తెలుస్తుంది.