సస్పెండ్ అయిన జడ్జి రామకృష్ణకు లేని బాధ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఏంటి ? అనే ప్రశ్న తలెత్తింది. రామకృష్ణకు ఆరోగ్యం బాగాలేదని, మెరుగైన వైద్యం అందించాలని గవర్నర్‌కు రఘురామ లేఖ రాయడం విమర్శలకు దారి తీస్తోంది.
రామకృష్ణకు కుటుంబ సభ్యులెవరూ లేకపోయి ఉంటే, ఆయన ఆరోగ్యంపై రఘురామ ఆందోళనను అర్థం చేసుకోవచ్చు. కానీ రామకృష్ణ ఆరోగ్యం గురించి అంతగా కలత చెందుతుంటే, రఘురామ చేయాల్సింది గవర్నర్‌కు లేఖ రాయడం కాదని హితవు చెబుతున్నారు.
రామకృష్ణ న్యాయపోరాటానికి ఆర్థిక వనరులు అందజేయాలని చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల ఎగిరేసి నరుకుతానని తీవ్ర వ్యాఖ్యలు చేసి రామకృష్ణ కటకటాలపాలైన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఆయన చిత్తూరు జిల్లా పీలేరు సబ్‌జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నారు. రామకృష్ణకు మెరుగైన వైద్యం అందించేందుకు జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు నరసాపురం రఘురామకృష్ణం రాజు లేఖ రాశారు.
సస్పెండైన జడ్జి రామకృష్ణ కుమారుడు వంశీకృష్ణ తనకు ఫోన్‌లో తండ్రి ఆరోగ్యం గురించి వివరించారన్నారు. తన తండ్రికి మెరుగైన వైద్యం కోసం గవర్నర్‌కు లేఖ రాసి సహకరించాలని కోరారని గవర్నర్‌కు రాసిన లేఖలో ప్రస్తావించడం గమనార్హం.
‘జడ్జి రామకృష్ణ మధుమేహం, ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. ఈ సమయంలో గవర్నర్ అయిన మీరు వెంటనే జోక్యం చేసుకోవాలి. రామకృష్ణను తిరుపతిలోని మంచి ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించేందుకు సహకరించాలి. సరైన సమయంలో మెరుగైన వైద్యం అందకపోతే అనర్థాలు కలిగే ప్రమాదం ఉంది. కావున రామకృష్ణ ఆరోగ్యాన్ని కాపాడేందుకు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నా’ అని రఘురామ రాజు లేఖలో పేర్కొన్నారు.
తనకు ఆరోగ్యం బాగా లేకపోతే ఆ విషయాన్ని సస్పెండ్ అయిన రామకృష్ణ చెప్పాలి. లేదా ఆయన కుటుంబ సభ్యులు చెప్పాలి. అదేంటో గానీ ఇక్కడ విచిత్రంగా ఉంది. రామకృష్ణ తనయుడు రఘురామకృష్ణంరాజుకు ఫోన్ చేసి సహకరించాలని కోరడం ఆశ్చర్యంగా ఉంది.
ఇటీవల తన తండ్రి బ్యారక్‌లోకి కొత్త వ్యక్తి వచ్చాడని జిల్లాస్థాయి మొదలుకుని రాష్ట్ర స్థాయిల్లోని పెద్దలందరికీ లేఖలు రాసి వంశీకృష్ణ న్యాయం పొందాడు. అలాంటప్పుడు తండ్రికి ఆరోగ్యం బాగాలేకపోతే, తాను గవర్నర్‌కో, హైకోర్టు చీఫ్ జస్టిస్‌కో లేఖ రాయకుండా …. రఘురామకృష్ణం రాజుకు రాయడం ఏంటి?
ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం పొందడం ఎలా అనే అంశంపై రఘురామకృష్ణంరాజు స్వీయ అనుభవాలను తెలుసుకోడానికి సదరు ఎంపీ గారి సలహాలు, సూచనలు తెలుసుకున్నారా? అయినా రామకృష్ణ కుటుంబ సభ్యులుండగా, రఘురామకృష్ణంరాజు లేఖ రాయడం ఏంటి? ఇలాంటి అనేక విమర్శలు, ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఇదో కొత్త డ్రామాకు అభివర్ణిస్తున్నారు.