మంచి కుటుంబం.. అందరూ బాగా చదువుకున్నారు.. ఉన్నత స్థానాల్లో ఉన్నారు. కానీ మూఢ భక్తి వాళ్లను హంతకులుగా మార్చేసింది. చదువులు చెప్పే వృత్తిలో ఉన్న ఆ తల్లిదండ్రులు.. తమ కన్న బిడ్డల్ని హతమార్చారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన ఈ ఘోరం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
మదనపల్లెలోని అంకిశెట్టిపల్లెలో పురుషోత్తంనాయుడు, పద్మజ ఉంటున్నారు. పురుషోత్తంనాయుడు ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజ్ లో వైస్-ప్రిన్సిపాల్. ఇక పద్మజ మరో విద్యాసంస్థకు ప్రిన్సిపాల్. వీళ్లకు ఇద్దరు పిల్లలు. 27 ఏళ్ల పెద్దమ్మాయి భోపాల్ లో పీజీ చేస్తోంది. 22 ఏళ్ల చిన్నమ్మాయి ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అకాడమీలో సంగీతం నేర్చుకుంటోంది.
ఇలా అల్లారుముద్దుగా సాగిపోతున్న వాళ్ల కుటుంబంలో మూఢ భక్తి చిచ్చుపెట్టింది. ముందునుంచి పురుషోత్తంనాయుడు, పద్మజకు భక్తి ఎక్కువ. ఇంట్లో ఎక్కువగా పూజలు చేసేవారు. ఈ క్రమంలో నిన్న రాత్రి కూడా పూజలు చేశారు.
ఈసారి తమ పూజలతో కూతుళ్లను చంపేసి తిరిగి బతికించాలనుకున్నారు. తమకు అతీత శక్తులున్నాయని భావించారు. ముందుగా చిన్నకూతుర్ని శూలంతో పొడిచి చంపేశారు. ఆ తర్వాత పెద్ద కుమార్తె నోటిలో చిన్న రాగిచెంబు పెట్టి డంబెల్ తో కొట్టి చంపేశారు.
పురుషోత్తంనాయుడుతో కలిసి పనిచేసే ఓ టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాగా చదువుకొని, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ మంత్రతంత్రాలకు అలవాటుపడి భార్యాభర్తలిద్దరూ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు .