రేపు పోలింగ్ జరగనున్న ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విషయంలో ఉత్కంఠతకు తెర తొలగింది. ఎన్నికల నిర్వహణకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియపై ఇది వరకూ న్యాయస్థానం విధించిన స్టే తొలగిపోయింది. డివిజన్ బెంచ్ తీర్పుతో రేపు యథారీతిన ఏపీలో ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ జరగనుంది.
ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఈ వ్యవహారాలు అనేక మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఏడాది కిందట వాయిదా పడిన ఎన్నికల ప్రక్రియ అప్పట్లోనే అనేక మలుపులు తిరిగింది. అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ, ఏపీ ప్రభుత్వం ఉప్పూనిప్పుల్లా సాగాయి.
చివరకు నిమ్మగడ్డ పదవీ విరమణతో వెళ్లిపోయినా మలుపులు మాత్రం కొనసాగాయి. ఈ ఎన్నికల ప్రక్రియపై తెలుగుదేశం పార్టీ నేతలు అభ్యంతరం చెబుతూ కోర్టుకు ఎక్కారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఆ పార్టీ కోరుకున్నట్టుగా వచ్చాయి. అయితే డివిజన్ బెంచ్ మాత్రం ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమంటూ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అయితే ఫలితాల వెల్లడి మాత్రం ఆపాలని ఆదేశించింది. బహుశా ఆ అంశంపై ఎస్ఈసీ మరోసారి కోర్టును ఆశ్రయించవచ్చు, కోర్టు మాత్రం తదుపరి ఆదేశాల వరకూ ఫలితాలను వెల్లడించవద్దని ఆదేశించింది.