కోవిడ్ లక్షణాలున్నాయని చింతిచొద్దు. ఇక మీద ఇంట్లోనే నిర్ధారణ పరీక్ష చేసుకోవచ్చు. జలుబు, ఆయాసం, జ్వరం…ఇలా కరోనా లక్షణాలుంటే ఆందోళనకు గురవుతాం. ముఖ్యంగా కరోనా టెస్ట్ చేయించుకుంటే, ఫలితం కోసం రోజుల తరబడి ఎదురు చూడడం అతి పెద్ద సమస్యగా మారింది. కోవిడ్ నిర్ధారణ ఫలితం వచ్చే లోపు …పుణ్యకాలం కాస్త ముగిసిపోయే పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజల ఆందోళన తగ్గించేందుకు ఓ కీలక నిర్ణయం వెలువడింది.
కరోనా నిర్ధారణకు ఇంట్లో చేసుకునే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కిట్ ‘కొవిసెల్ఫ్’కు ఐసీఎంఆర్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా కరోనా లక్షణాలున్న వ్యక్తలు స్వయంగా కిట్‌ను వినియోగించి ముక్కు ద్వారా నమూనాలు సేకరించి తమకు తామే పరీక్ష చేసుకుని …ఫలితాన్ని వెంటనే తెలుసుకోవచ్చు. దీంతో కరోనా బారిన పడ్డామనే ఆందోళన నుంచి బయటపడే వెసులుబాటు కలిగింది.
ల్యాబ్‌లో పాజిటివ్‌గా పరీక్షించిన వ్యక్తుల రోగ లక్షణాలు తెలుసుకునేందుకు, కాంటాక్ట్ పరిచయాలు మాత్రమే హోం టెస్ట్ కిట్‌ను వినియోగించాలని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. యాంటీజెన్ కిట్ల ద్వారా పాజిటివ్‌గా తేలిన వారందరినీ పాజిటివ్‌గా తేల్చొచ్చని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వారికి మళ్లీ పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఒకవేళ యాంటీజెన్ టెస్టు ద్వారా ఫలితం నెగెటివ్‌గా వస్తే మాత్రం… వెంటనే ఆర్‌టీపీసీఆర్ టెస్టు చేయించుకోవాలని సూచించింది.
యాంటీజెన్ టెస్టులో నెగెటివ్‌గా తేలి, లక్షణాలున్న వారందరినీ కొవిడ్ అనుమానితులుగా భావించొచ్చని, వారంతా ఐసీఎంఆర్.. ఆరోగ్య శాఖ హోం ఐసొలేషన్ మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్‌ను పుణెలోని మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ సంస్థ తయారు చేసింది. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్‌ను ఉపయోగించుకునేందుకు మొబైల్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
దాని ద్వారా పాజిటివ్, నెగెటివ్ రిపోర్టును అందుకోవచ్చు. ఇంట్లో టెస్ట్ చేసు కునే వారు తమ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న యాప్ నుంచి టెస్ట్ స్ట్రిప్ ఫొటో తీసి, అప్‌లోడ్ చేయాలి. ఈ డేటా నేరుగా ఐసీఎంఆర్ కరోనా టెస్ట్ పోర్టల్‌లో సేవ్ అవుతుంది. ఈ విధానంలో టెస్టు చేసుకున్న తర్వాత మరో టెస్టు అవసరం లేదు.
ముఖ్యంగా కోవిడ్ టెస్ట్‌కు వెళితే మహమ్మారి బారిన పడతామని ఆందోళన చెందేవారికి ఇది ఉపశమనం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొద్దిపాటి లక్షణాలే కదా, టెస్ట్ ఎందుకని ప్రాణాల మీదకి తెచ్చుకునే ప్రమాదం నుంచి బయటపడేందుకు కూదా ఇది ఎంతో ఉపకరిస్తుంది.