కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేస్తామని, ఆ రకంగా ఉద్యోగులు అందరికీ మేలు చేస్తాం అని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ముందు హామీ ఇచ్చారు. కానీ.. అది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ హామీని అమల్లోకి తీసుకురావడం అనేది ఆచరణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
సీపీఎస్ రద్దు సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ విషయంలో ఉద్యోగ సంఘాలకు నెమ్మది నెమ్మదిగా నచ్చజెప్పి, వారి నుంచి వ్యతిరేకత పెద్దఎత్తున వెల్లువెత్తకుండా ఈ గండం తప్పించుకోవాలని జగన్ సర్కారు యోచిస్తున్నట్టుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి.. సీపీఎస్ రద్దు సాధ్యం కాదనే అర్థంవచ్చేలా ప్రభుత్వం పరంగా లీకులు ఇస్తున్నారు.
మంగళవారం నాడు పరిణామాలు ఇందుకు ఉదాహరణ. మండలిలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడుతూ ఇది అంత సులభంగా అయ్యే పని కాదని చెప్పడం విశేషం. నెలన్నరగా దీనిపై కసరత్తు జరుగుతోందని వెల్లడించిన ఆయన, ముఖ్యమంత్రి ప్రతివారం సమీక్ష నిర్వహిస్తున్నారని కూడా చెప్పారు.
త్వరలో ప్రభుత్వం దీనిపై విధానపరమైన ప్రకటన చేస్తుందని అన్నారు. అదేమిటో తేలకుండా వివరాలు వెల్లడించడం సాధ్యం కాదని, అలా చేస్తే వేరే అర్థాలు వచ్చే ప్రమాదం ఉన్నదని, మొత్తానికి విధాన ప్రకటన అందరికీ ఆమోదయోగ్యంగానే ఉండగలదని బుగ్గన అన్నీ నర్మగర్బ వ్యాఖ్యలే చేశారు.
ఉద్యోగుల సమ్మె ఎపిసోడ్ సమయంలో కూడా సీపీఎస్ రద్దు అనేది వారి ప్రధాన డిమాండ్లలో ఒకటి. ఎటూ ఆ విషయం ఎన్నికలకంటె ముందే జగన్ హామీ ఇచ్చారు గనుక చేసి తీరాలని అంతా అడిగారు. ఖచ్చితంగా చేస్తాం అని ప్రభుత్వం కూడా చెప్పింది. కానీ వాస్తవంగా సీపీఎస్ రద్దు అంత సులువైన సంగతి కాదు. కేంద్రంతో కూడా ముడిపడిన వ్యవహారం ఇది.
అదే విషయాన్ని బుగ్గన మరో రకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులు సీపీఎస్ రద్దుకు అనుకూలంగా మాట్లాడుతున్నారని.. వారు ఒకసారి తమ కేంద్రనాయకత్వం అనుమతి తీసుకుని ఈ విషయంలో మాట్లాడితే బాగుంటుందని కూడా ఆయన సెలవిచ్చారు. అంటే.. బీజెపీ కూడా రద్దుకు వ్యతిరేకంగానే ఉన్నదని, రాష్ట్ర బిజెపి నాయకులు.. రాజకీయమైలేజీ కోసం అలా మాట్లాడుతున్నారని దెప్పి పొడవడమే. ఈ మాటలన్నీ కూడా.. సీపీఎస్ రద్దు ఉద్యోగులు కోరుకుంటున్న రీతిలో జరగబోవడం లేదని స్పష్టం చేసేస్తున్నాయి.
అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఒక సూచన చేశారు. ఏప్రిల్ 4 నుంచి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని, సీపీఎస్ పై నిర్ణయం తీసుకునే ప్రక్రియలో ఉద్యోగ సంఘాలను కూడా భాగస్వాముల్ని చేయాలని సీఎం సూచించారు. ఉద్యోగులు అడిగినది సీపీఎస్ రద్దు! అది చేసేస్తే ఇక వారితో సంప్రదించడమూ, భాగస్వాముల్ని చేయడంతో అవసరం ఉండదు. అది చేయకుండా.. మధ్యేమార్గంగా మరో ప్రతిపాదన చేయవలసి వచ్చినప్పుడే అవంతా అవసరం అవుతాయి.
అందుకే ఈ పరిణామాలను పరిశీలిస్తున్నప్పుడు.. సీపీఎస్ రద్దు అనేది ఉద్యోగులు కోరుకుంటున్న రీతిలో ఎప్పటికీ సాధ్యం కాదని.. అది ఎప్పటికీ ఆరని మంటగానే మిగిలి ఉంటుందని అర్థమవుతోంది.