ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభానికి జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పాఠశాలల ప్రారంభానికి శుభముహూర్తాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది.
కరోనా సెకెండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఒక్కొక్కటిగా అన్ని వ్యవస్థలు తెరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో విద్యా రంగంపై సీఎం జగన్ దృష్టి సారించారు. దీనిపై బుధవారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు.
రాష్ట్రంలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించేందుకు సీఎం అంగీకరించారు. అలాగే ఈ నెల 12 నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించాలని ఆయన ఆదేశించారు.
ఆగస్టు మొదటి వారంలోపు పాఠశాలల్లో నాడు-నేడు పెండింగ్ పనుల పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కోవిడ్ దెబ్బతో రెండో ఏడాది కూడా పాఠశాలలు మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆన్‌లైన్ చదువులతో విద్యార్థులు, ఉపాధ్యాయులు సరి పెట్టుకోవాల్సి వచ్చింది.
మరోవైపు చదువులు ముందుకు సాగకపోవడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా సెకెండ్ వేవ్ తగ్గుముఖం పట్టడం ఊరట కలిగిస్తోంది.
ఇదిలా ఉండగా నూతన విద్యా విధానాన్ని ఏపీలో అమలు చేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. దీని వల్ల స్కూళ్లు మూతపడవని, అలాగే ఒక్క ఉపాధ్యాయు పోస్టు కూడా తగ్గదని మంత్రి హామీ ఇచ్చారు.