వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సవాల్ ఎంతవరకు వచ్చింది. తాను తొడగొట్టి సవాల్ విసిరినట్టు రాజీనామా చేసి తిరిగి ఎంపీగా ఆయన గెలవగలరా..? జగన్ ఫొటో కాదు, నా ఫేస్ వేల్యూ చూసి జనం ఓట్లు వేశారని చెప్పుకునే రఘురామ, తిరిగి ఎన్నికల ప్రచారంలో జనానికి తన మొహం చూపించగలరా..? సీఐడీ అధికారులొస్తున్నారని తెలిసి ఢిల్లీకి పారిపోయే పెద్ద మనిషికి అసలు తన డెడ్ లైన్ గుర్తుందా..?
ఆ మధ్య తెలంగాణలో కాంగ్రెస్ గెలవకపోతే బ్లేడ్ తో గొంతు కోసుకుంటానంటూ బండ్ల గణేష్ చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. ఆ దెబ్బతో బండ్ల గణేష్ కాస్తా, బ్లేడ్ గణేష్ గా మారిపోయారు. ఏపీ రాజకీయాల్లో సరిగ్గా అలాంటి వ్యక్తి రఘురామకృష్ణంరాజు. ఆయన వ్యవహార శైలితో విసిగిపోయిన వైసీపీ, అనర్హత వేటు వేయాలంటూ లోక్ సభ స్పీకర్ కి ఫిర్యాదు చేసింది.
రేపో మాపో వ్యవహారం తేలిపోతుందనుకుంటున్న వేళ, రఘురామ నేరుగా లైన్లోకి వచ్చి తానే రాజీనామా చేస్తానన్నారు. క్రమశిక్షణ కమిటీ తనపై తేల్చేదేంటంటూ ఆవేశం చూపించారు. ఫిబ్రవరి 5 లోగా తనే రాజీనామా చేస్తానన్నారు.
తనపై అనర్హత వేటు వేయకపోతే తానే స్వయంగా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తానన్నారు రఘురామ కృష్ణంరాజు. జగన్ ని వ్యతిరేకించేవాళ్లంతా తనతో జట్టు కట్టాలని ప్రగల్భాలు పలికారు. ఒకవేళ నిజంగా ఎన్నికలకు వెళ్తే ప్రతిపక్షాలు కచ్చితంగా తనకు సపోర్ట్ చేస్తాయనేది ఆయన ఆశ. కానీ చంద్రబాబు రఘురామను ఎంతవరకు కావాలో అంతవరకే వాడుకుంటారు. పోనీ బీజేపీ అక్కున చేర్చుకోడానికి ఈటల రాజేందర్ లాగా, రఘురామకు సొంత బలం, బలగం ఉందా అంటే.. అదీ లేదు.
ఇవన్నీ తెలుసుకున్న రఘురామ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. అనర్హత వేటు పడేలోపు సింపతీ కోసం తానే రాజీనామా చేయాలనుకుంటున్నా.. అది సాధ్యం కావడంలేదు. తనకు తానుగా రాజీనామా చేస్తే గెలవలేనని తేలిపోవడంతో ఆయన వెనకడుగు వేశారు. అనర్హత వేటు పడితే.. ఆ సింపతీని వాడుకోవాలనుకుంటున్నారు. అందుకే నిన్నటితో డెడ్ లైన్ ముగిసినా ఆయన ఇంకా బయటకు రాలేదు. ఎంపీ పదవినే పట్టుకుని వేలాడుతున్నాడు.