కరోనా సోకి ఐసొలేషన్ లోకి వెళ్లిన చిరంజీవి పూర్తిగా కోలుకున్నారు. తిరిగి తన సినిమాల్ని స్టార్ట్ చేశారు. ఈ విషయాన్ని కొద్ది సేపటి కిందట ఆయన స్వయంగా ప్రకటించారు. తను పూర్తిగా కోలుకున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆన్-లొకేషన్ స్టిల్స్ కూడా షేర్ చేశారు.
“పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. మళ్లీ పనిలో పడ్డాను, మళ్లీ యాక్షన్ మొదలైంది. నేను కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ మనసారా కృతజ్ఞతలు.” ఇలా తను కోలుకున్న విషయాన్ని చిరంజీవి ట్వీట్ చేశారు. రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నానని చెప్పుకొచ్చిన చిరు.. గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ కు సంబంధించి కొన్ని స్టిల్స్ ను పోస్ట్ చేశారు.
ఊహించని విధంగా కరోనా బారిన పడ్డారు చిరంజీవి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయన గతనెల 26న ప్రకటించారు. ఆ వెంటనే ఐసొలేషన్ లోకి వెళ్లారు. చిరంజీవి ఐసొలేషన్ లో ఉన్నప్పుడే ఆయన తల్లి పుట్టినరోజు జరుపుకున్నారు. తల్లి పుట్టినరోజున ప్రత్యక్షంగా ఆమెకు శుభాకాంక్షలు చెప్పి, ఆశీర్వాదం తీసుకోలేకపోతున్నానంటూ తన బాధను వ్యక్తం చేశారు చిరంజీవి.
అలా 10 రోజులు ఐసొలేషన్ లో ఉన్న చిరంజీవి, కరోనా పరీక్షల్లో నెగెటివ్ అని తేలిన తర్వాత బయటకొచ్చారు. నేరుగా గాడ్ ఫాదర్ షూటింగ్ లొకేషన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా తను కరోనా నుంచి కోలుకున్న విషయాన్ని ప్రకటించారు. చిరంజీవి ప్రకటనతో ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.