సమ్మె చేస్తామన్న ఉద్యోగులు చివరికి ఏం సాధించారు

పాత పీఆర్సీనే అమలు చేయాలన్నారు. సమ్మె నోటీసులిచ్చారు. విజయవాడ సభను సూపర్ సక్సెస్ చేశారు. ప్రభుత్వంపై ఐటెంసాంగ్స్ తో విరుచుకుపడ్డారు. ఒక దశలో చర్చలకు కూడా వచ్చేది లేదన్నారు. ఇంత ఎగ్రెసివ్ గా సమ్మెకు…

పాత పీఆర్సీనే అమలు చేయాలన్నారు. సమ్మె నోటీసులిచ్చారు. విజయవాడ సభను సూపర్ సక్సెస్ చేశారు. ప్రభుత్వంపై ఐటెంసాంగ్స్ తో విరుచుకుపడ్డారు. ఒక దశలో చర్చలకు కూడా వచ్చేది లేదన్నారు. ఇంత ఎగ్రెసివ్ గా సమ్మెకు దిగిన ప్రభుత్వ ఉద్యోగులు, ఎట్టకేలకు తమ సమ్మె ఆలోచనను విరమించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో రాజీకి వచ్చారు. ఇన్ని రోజులు హంగామా చేసి, ప్రభుత్వం సున్నం పెట్టించుకొని చివరికి ఉద్యోగులు సాధించిందేంటి?

ఫిట్ మెంట్ చాలా తక్కువ ఇచ్చారని కొందరు ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. 23 శాతంగా కాకుండా 27 శాతం ఫిట్ మెంట్ కావాలన్నారు. కానీ చర్చల్లో 23 శాతం ఫిట్ మెంట్ కే అంగీకరించారు. ఇక కీలకమైన ఐఆర్ విషయానికొస్తే.. 27శాతం ఇచ్చారు. సర్దుబాటు ఉంటుందని చెప్పారు. తాజాగా జరిగిన చర్చల్లో అలాంటి సర్దుబాటు (రికవరీ) ఉండదని స్పష్టం చేసింది ప్రభుత్వం. అయితే ఐఆర్ లో 9 నెలలకు సంబంధించి రికవరీ ఉండబోదని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి మిగతా 21 నెలల పరిస్థితేంటి? ఆ నెలలకు గాను రికవరీ ఉంటుందా?

ఇక ఉద్యోగులు బాగా పట్టుబట్టిన మరో అంశం హెచ్ఆర్ఏ. జనవరి 17న ఇచ్చిన జీవోలో ప్రకటించిన హెచ్ఆర్ఏలు తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని ఉద్యోగులంతా ఏకాభిప్రాయం వ్యక్తంచేశారు. వీటిని చర్చల అనంతరం ప్రభుత్వం సవరించింది. ఈ విషయంలో మాత్రం ఉద్యోగులు అనుకున్నది సాధించగలిగారు. చిన్నచిన్న పట్టణ కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లో ఉన్న ఉద్యోగులకు సైతం మంచి ప్రయోజనం కలిగేలా హెచ్ఆర్ఏ అందుబాటులోకి వచ్చింది. సవరించిన హెచ్ఆర్ఏ ప్రకారం ప్రతి ఉద్యోగి కనిష్టంగా 3 శాతం నుంచి గరిష్టంగా 10శాతం వరకు అదనపు ప్రయోజనం పొందబోతున్నాడు.

కేంద్ర ప్రభుత్వం ప్రకారం పదేళ్లకు ఒకసారి పీఆర్సీని అమలు చేస్తామని నిబంధనను కూడా ప్రభుత్వం తొలిగించింది. ఇంత‌కుముందు ఉన్నట్టుగానే ఐదేళ్లకొకసారి పీఆర్సీని అమలు చేస్తామని ప్రకటించింది. పైగా ఈ విషయంలో కేంద్ర మార్గదర్శకాల్ని కాకుండా, గతంలో ఉన్నట్టుగానే రాష్ట్రంలో అనుసరిస్తున్న విధానాన్నే అనుసరించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.

ఇక ఎక్స్ ట్రా క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కు సంబంధించి ఉద్యోగులు ఏం సాధించారో అర్థంకాని పరిస్థితి. గతనెల వెలువరించిన కొత్త జీవో ప్రకారం చూసుకుంటే.. 80 ఏళ్లు దాటిన పెన్షనర్లకు బేసిక్ పెన్షన్ పై 20శాతం అదనంగా ఇవ్వాలని నిర్ణయించారు. కానీ చర్చల ద్వారా ఉద్యోగులు సాధించిందేంటంటే.. 70 ఏళ్లు దాటిన పెన్షనర్ 7 శాతం అదనంగా పొందుతాడు. అలా ఐదేళ్ల పాటు అదనపు పెన్షన్ అందుకుంటాడు. ఆ తర్వాత 75 ఏళ్ల నుంచి మరో ఐదేళ్ల పాటు 12 శాతం క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అందుకుంటాడు. దీనిపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

గమనించాల్సిన విషయం ఏంటంటే.. 2015లో ప్రకటించిన పీఆర్సీ స్థాయిలో కూడా ఉద్యోగులకు హెచ్ఆర్ఏ అందడం లేదు. ఈ విషయంపై కొన్ని ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అయితే జనవరి జీవోతో పోలిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే గొప్ప అంటున్నాయి మరికొన్ని ఉద్యోగ సంఘాలు. 

మొత్తమ్మీద తాజా చర్చలతో ఇటు ప్రభుత్వం కొన్ని మెట్లు దిగివచ్చింది. అటు ఉద్యోగ సంఘాలు కూడా కొంత రాజీ పడ్డాయి. అలా మధ్యేమార్గంగా అంతా ఓ ఒప్పందానికి వచ్చారు. మొన్నటివరకు జగన్ పై ఐటెంసాంగ్స్ కట్టి తిట్టిన ఇదే ఉద్యోగులు, చర్చల అనంతరం ముఖ్యమంత్రికి క్షమాపణలు చెప్పారు. జగన్ ను దేవుడంటూ ఆకాశానికెత్తేశారు.