బాలీవుడ్ విఖ్యాత గాయని లతా మంగేష్కర్ తుదిశ్వాస విడిచినట్టుగా తెలుస్తోంది. కరోనా కారణంగా ఆసుపత్రి పాలైన ఈ మధుర గాయని మరణ వార్తను మహారాష్ట్ర రాజకీయ ప్రముఖుడు సంజయ్ రౌత్ ట్విటర్ ద్వారా ప్రకటించారు. లతా మేడమ్ ఇక లేరని ఆయన ట్వీట్ చేయడంతో ఈ వార్త ప్రచురించడం జరుగుతోంది.
92 యేళ్ల లత ఇటీవలే కరోనా బారిన పడ్డారు. ముంబైలోని ఒక ఆసుపత్రిలో చేరారు. ఆమె కరోనాను జయించినట్టుగా కూడా ఇటీవలే ప్రకటన వచ్చింది. ఆమె కరోనా నెగిటివ్ అని వైద్యులు ప్రకటించారు. అయితే కరోనా నెగిటివ్ అయినా, ఆమె ఇంకా పూర్తి కోలుకోలేదని నిన్ననే వైద్యులు ప్రకటించారు. ఇంతలోనే ఆమె మరి లేరనే వార్తలు వస్తున్నాయి.
హిందీ సినీ ప్రియులకు లతా మంగేష్కర్ నేపథ్యాన్ని, ఆమె గానంలోని మాధుర్యం గురించి వేరే వివరించనక్కర్లేదు. తెలుగులో ఆమె పాడిన పాటలు వేళ్ల మీద లెక్కబెట్టదగినవే అయినా, ఆమె హిందీలో ఆలపించిన సినిమా పాటలు మాత్రం తెలుగునాట కూడా మార్మోగాయి. కల్ట్ హిట్ అయ్యి, తెలుగులోని పామర సినీ ప్రియులకు కూడా చేరువయ్యాయి.
భారతరత్న పురస్కారంతో పాటు బోలెడన్ని పురస్కారాలను పొందిన లత తన కెరీర్ లో సుమారు ఇరవై ఆరు వేల పాటల వరకూ పాడారని లెక్క వేస్తారు అభిమానులు. సినీ సంగీత ప్రియులకు కరోనా దూరం చేసిన రెండో వ్యక్తి లతా మంగేష్కర్.
గత ఏడాది ప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా బారిన పడి, కరోనా నెగిటివ్ గా తేలాకా.. తుదిశ్వాస విడిచారు. ఇప్పుడు లతా మంగేష్కర్ కూడా అదే రీతిన భౌతికంగా దూరం అయ్యారు.