భారత యువ క్రికెట్ జట్టుకు బీసీసీఐ నజరానా ప్రకటించింది. అండర్-19 ప్రపంచకప్ సాధించిన యువ ఆటగాళ్లకు ప్రోత్సాహకర నగదు బహుమతులను బీసీసీఐ ప్రకటించింది. భారత క్రికెట్‌కు ఉజ్వల భవిష్యత్ ఉందని యువ ఆటగాళ్లు నిరూపించారు. ఐసీసీ అండర్-19 ప్రపంచ్ కప్‌లో భారత యువ జట్టు చిరస్మరణీయమైన విజయాన్ని సాధించింది.
అండర్-19 ప్రపంచకప్‌ను భారత జట్టు ఐదోసారి గెలుపొందడం విశేషం. శనివారం రాత్రి జరిగిన ప్రతిష్టాత్మక ఆటలో తన బలమైన ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టును భారత జట్టు మట్టి కరిపించింది. దీంతో భారత క్రీడాభిమానులు సంబరాలు చేసుకున్నారు.
ఇదిలా ఉండగా భారత్ పేరును మరోసారి ప్రపంచ వ్యాప్తంగా మార్మోగించినందుకు బీసీసీఐ తన ఆనందాన్ని ప్రకటించింది. అలాగే యువ ఆటగాళ్లకు భారీ నజరానా ప్రకటించింది. ముందుగా దేశానికి ప్రపంచకప్ సాధించిన యువ భారత్ జట్టుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌గంగూలీ, సెక్రటరీ జైషా ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఒక్కో ఆటగాడికి రూ.40 లక్షలు, అలాగే సహాయకులకు రూ.25 లక్షలు చొప్పున నగదు బహుమతి ఇవ్వనున్నట్టు సెక్రటరీ జైషా ప్రకటించారు. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా కుమారుడే జైషా. ఈయన బీసీసీఐలో సెక్రటరీగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. క్రికెటర్ల ప్రతిభను ప్రోత్సహించడంలో జైషా ముందంజలో ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.