తాడిపత్రి జేసీ బ్రదర్స్ అంటే పరిచయం అక్కర్లేని రాజకీయ నాయకులు. నిన్న మొన్నటి వరకు జేసీ కుటుంబానికి తాడిపత్రి ఓ కంచుకోట. కానీ ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయనే సామెత చందాన వైఎస్ జగన్ దెబ్బతో జేసీ బ్రదర్స్ పరపతి అమాంతం పడిపోయింది.
రాజకీయాల నుంచి జేసీ సోదరులు దివాకర్‌రెడ్డి , ప్రభాకర్‌రెడ్డి తప్పుకుని, వాళ్ల తనయులైన పవన్‌కుమార్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలను బరిలో దింపారు.
వైఎస్ జగన్ హవా ముందు జేసీ బ్రదర్స్ పలుకుబడి తేలిపోయింది. దీంతో మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచిన జేసీ బ్రదర్స్ తనయుడు పవన్, అస్మిత్‌రెడ్డిలు ఓటమిపాలయ్యారు.
గతంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని వైఎస్ జగన్‌తో పాటు ఆయన కుటుంబంపై ముఖ్యంగా జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో దూషణకు దిగారు. అధికారం పోగానే నాడు చేసిన తప్పులు …నీడలా నేడు వెంటాడుతుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు జైలుపాలు కావాల్సి వచ్చింది.
ఇటీవల వైఎస్ కుటుంబంపై జేసీ బ్రదర్స్ నోటి దురుసు కొంత తగ్గిందనే చెప్పాలి. మామ గారి స్థానాన్ని జేసీ ప్రభాకర్‌రెడ్డి అల్లుడు , ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి భర్తీ చేసేందుకు యత్నిస్తున్నట్టు ఆయన రాజకీయ పంథా చూస్తే అర్థమవుతోంది.
ఈయన రోజూ టీవీ డిబేట్లలో పాల్గొంటూ వైఎస్ జగన్ సర్కార్‌పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా లాజిక్‌ను ఆయన మిస్ అవుతున్నారు. చంద్రబాబు మెప్పు కోసం వాస్తవాలను విస్మరించి, అబద్ధాలను ఆయన ఆశ్రయిస్తున్నారు.
దీపక్‌రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత లేకపోయినా, ఒక్క అవకాశం ఇచ్చి చూద్దామని జగన్‌కు పట్టం కట్టారన్నారు. పాదయాత్రలో ఒకే ఒక్క చాన్స్ అంటూ వేడుకున్నారని, ఆ రకంగా లాటరీలో జగన్ గెలిచారని అభిప్రాయపడ్డారు.
ఏనుగుల గుంపు గ్రామాలపై పడినట్లు.. వైసీపీ నేతలు అహంకారంతో ప్రజల్ని విచ్చలవిడిగా దోచుకుంటున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 34కి పైగా పథకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని దీపక్‌రెడ్డి విమర్శించారు.
రానున్న రోజుల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. ప్రజల్లో చంద్రబాబుపై వ్యతిరేకత లేదని దీపక్‌రెడ్డి చెప్పడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. అల్లుడు గారూ… ఏమి సెప్తిరి సెప్తిరి అంటూ వ్యంగ్య కామెంట్స్ పెడుతున్నారు.