బిగ్‌బాస్ రియాల్టీ షోను నిర్వహిస్తున్న స్టార్మాను తిడుతూ ఓ యువతి సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఆ యువతి సాధారణ వ్యక్తి అయి వుంటే ఎవరూ పెద్దగా పట్టించుకుని ఉండేవారు కాదు. కానీ బిగ్‌బాస్ సీజన్-4లో అల్లరి పిల్లగా పేరొందిన దేత్తడి హారిక సదరు రియాల్టీ షోపై కోపాన్ని ప్రదర్శించడం సహజంగానే ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు.
బిగ్‌బాస్ రియాల్టీ షో సీజన్-5 ఇవాళ్టితో ముగుస్తుంది. అనధికారికంగా విజేత ఎవరనేది సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమ వుతోంది. అయితే బిగ్‌బాస్ అప్పుడప్పుడు షాక్‌లు ఇస్తుండడంతో, చివరి నిమిషంలో ప్రచారమవుతున్నట్టు విజేత పేరు మారుతుందేమోనన్న ఉత్కంఠ లేకపోలేదు. ముఖ్యంగా సన్నీ, షణ్ముక్ మధ్య గట్టి పోటీ నడిచింది. వీళ్లలో సన్నీ విజేత అవుతారనేది మెజార్టీ అభిప్రాయం. కానీ యూట్యూబర్‌గా షణ్ను పాపులర్ కావడంతో, నెటిజన్లు ఓట్లు వేసి ఉంటారని అభిమానుల నమ్మకం.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో బిగ్‌బాస్ రియాల్టీ షోకు సంబంధించి ఇద్దరు మాజీ మహిళా కంటెస్టెంట్ల పోస్టులు వైరల్ అవుతున్నాయి. వారిలో ఒకరు షణ్ముక్ సన్నిహితురాలు కూడా ఉండడం విశేషం. ఆ పోస్టుల సంగతేంటో చూద్దాం.
ముందు షణ్ను ప్రేయసి దీప్తి సునయన తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పెట్టిన ఆసక్తికర పోస్టు గురించి తెలుసుకుందాం.
'జీవితంలో ప్రతీది ఏదో ఒక కారణంతోనే జరుగుతోంది, షణ్ముక్ కోసం నిలబడినందుకు, మీ ప్రేమ అందించినందుకు ధన్యవాదాలు' అని రాసుకొచ్చింది. విజయం తీరాల వరకూ తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు చెబుతున్నారా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదే సందర్భంలో మరో కంటెస్టెంట్ దేత్తడి హారిక పోస్టు గురించి తెలుసుకుందాం. 'ఇది చెత్త నిర్ణయం స్టార్ మా' అంటూ తన ఆగ్రహాన్ని ఆమె ప్రదర్శించింది. ఇంతకూ దేత్తడి సపోర్ట్ చేస్తున్నదెవరిని? అందుకు విరుద్ధంగా ఎవరు గెలుస్తున్నారని ఆమె అనుకుంటోందనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. కానీ ఆమె నమ్మకానికి విరుద్ధంగా తీర్పు వస్తోందనే సమాచారంతోనే దేత్తడి మండిపడుతున్నారనే వాదన వినిపిస్తోంది.