‘జై అమరావతి’ ఉద్యమంపై రంగు పడింది. రంగు అంటే కులం ముద్ర కాదండోయ్. అది ఎప్పుడో పడింది. తమకు తాముగానే ‘అమరావతి’ ఆ పని మొదట్లోనే చేసింది. ఇప్పుడు కొత్తగా మరో రంగు గురించి తెలిసొచ్చింది. ‘జై అమరావతి’ అంటూ ఇటీవల తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఓ వ్యక్తి అసలు బండారం ఏంటో బయటపడింది. దీంతో సోషల్ మీడియా ఓ ఆట ఆడుకుంటోంది.
రెండురోజుల క్రితం రాయలసీమ నడిగడ్డపై చంద్రబాబు పట్టుపట్టి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఓ వృద్ధుడు ఒళ్లంతా ‘జై అమరావతి’ అంటూ వివిధ రంగులతో రాయించుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ వ్యక్తి రైతు జెండాను పట్టుకున్న ఫొటోను ఎల్లో పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. బహుశా అమరావతి నుంచి నడుచుకుంటూ వచ్చిన వృద్ధుడేమో అని అందరూ భావించారు.
సీన్ కట్ చేస్తే… తిరుపతి వాసులు అతన్ని పసిగట్టి సోషల్ మీడియాలో అసలు విషయాన్ని బయట పెట్టారు. సదరు వృద్ధుడి పేరు ప్రసాద్. తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల సమీపంలో పదేళ్లుగా యాచన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఎల్లో పత్రికల్లో ప్రధానంగా ప్రచురించిన ఫొటోలను చూపి… ఏంటి కథ తాతా అని ప్రశ్నించిన వాళ్లకు ఆయన అసలు రహస్యం చెప్పాడు.
తనకు తెలుగుదేశం పార్టీ నాయకులు రూ.200 ఇచ్చి ఒళ్లంతా రంగులు వేయించి అమరావతి సభకు తీసుకెళ్లారని చెప్పాడు. సభ ముగిసిన వెంటనే తిరిగి విడిచి పెట్టి వెళ్లారని చెప్పుకొచ్చాడు. ఇతరుల సభలకు వాళ్లొచ్చారు, వీళ్లొచ్చారని విమర్శించే, రాసే వాళ్లకు ఈ వృద్ధుడు కనిపించలేదా? అని ప్రశ్నిస్తే సమాధానం ఏంటి?