తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొంటేనే జన్మ ధన్యమైనట్టు భావిస్తారు చాలామంది. అర నిముషంలో గుడి లోపలి నుంచి ఇరుకు క్యూలైన్లో బయటపడిపోకుండా.. సుప్రభాతం పూర్తయ్యేంత వరకు స్వామిని మదిలో తలచుకుంటూ అక్కడే ఉండటం గొప్ప అనుభూతి. అలాంటిది సుప్రభాతంతో మొదలై.. స్వామివారి పవళింపు సేవ వరకు ఆలయంలో ఉండే అవకాశం అంటే మాటలా. అది వెలకట్టలేని అవకాశం. ఉదయాస్తమాన సేవలతో ఈ అవకాశాన్ని భక్తులకు కల్పిస్తోంది టీటీడీ.
ఉదయం సుప్రభాత సేవతో మొదలై.. తోమాల సేవ, కొలువు, అష్టదళ పాద పద్మారాధన, స్వామివారి అభిషేకం, వస్త్రాలంకరణ, కల్యాణోత్సవం, రథోత్సవం, తిరుప్పావడ, సహస్ర దీపాలంకరణ సేవ.. చివరిగా ఏకాంత సేవ.. అలా అన్ని సేవల్లోనూ పాల్గొనే అరుదైన అవకాశం ఇది. ఈనెల 23 నుంచి ఈ ఉదయాస్తమాన సేవ ట్రయల్ రన్ మొదలవుతుంది. జనవరి రెండోవారం నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయి.
కోటి రూపాయల టికెట్.. ఆరుగురికి అకాశం..
అయితే ఇది అందరికీ అందుబాటులో ఉండే సేవ ఎంత మాత్రం కాదు. ఎందుకంటే దీని రేటు అక్షరాలా కోటి రూపాయలు. ఈ టికెట్ తో ఆరుగురు స్వామివారి ఉదయాస్తమాన సేవల్లో పొల్గొనవచ్చు. మొత్తం 531 టికెట్లు విడుదల చేయాలని భావిస్తోంది టీటీడీ. ప్రతి రోజూ టికెట్ ధర కోటి రూపాయలు, శుక్రవారం మాత్రం కోటిన్నర రూపాయలుగా నిర్ణయించారు.
ఈ టికెట్లకు డిమాండ్ ఏ స్థాయిలో ఉంటుందో విడుదల చేసిన తర్వాత తెలుస్తుంది. ధర కాస్త ఎక్కువైనా, స్వామివారి సేవల్లో పాల్గొనే అద్భుత అవకాశం కాబట్టి, చాలామంది దీన్ని సద్వినియోగం చేసుకోడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం.
ఆస్పత్రికి విరాళం ఇచ్చినట్టే..
ఉదయాస్తమాన సేవల్లో పాల్గొనేవారి వద్ద తీసుకునే టికెట్ రుసుముని నేరుగా చిన్నారుల ఆస్పత్రి నిర్మాణానికి వెచ్చించబోతోంది టీటీడీ. టికెట్ల అమ్మకం ద్వారా 600 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని, దాన్ని నేరుగా చిన్నారుల ఆస్పత్రి నిర్మాణానికి వెచ్చిస్తామని తెలిపారు అధికారులు.
అంటే ఉదయాస్తమాన సేవకు టికెట్ తీసుకుంచే, స్వామివారి సేవాభాగ్యంతో పాటు, చిన్నారుల ఆస్పత్రి నిర్మాణంలో పాలుపంచుకునే పుణ్యం కూడా ఏక కాలంలో లభిస్తుందనమాట.