ఐపీఎల్ జ‌ట్టు మెంట‌ర్ గా బీజేపీ ఎంపీ!

గౌత‌మ్ గంభీర్… కేవ‌లం మాజీ క్రికెట‌ర్ కాదు, ప్ర‌స్తుతం ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ కూడా. ఢిల్లీ ప‌రిధిలోని ఒక లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గంభీర్ ఎంపీగా ఉన్నారు. హార్డ్ కోర్…

గౌత‌మ్ గంభీర్… కేవ‌లం మాజీ క్రికెట‌ర్ కాదు, ప్ర‌స్తుతం ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ కూడా. ఢిల్లీ ప‌రిధిలోని ఒక లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గంభీర్ ఎంపీగా ఉన్నారు. హార్డ్ కోర్ కాషాయ‌వాదిలా స్పందిస్తూ ఉంటారు గంభీర్. ఎంపీగా జ‌నాల మ‌ధ్య‌న తిరుగుతూ ఎప్పుడూ వార్త‌ల్లో నిలిచింది లేదు కానీ.. ట్విట‌ర్లో త‌న వ్యాఖ్య‌ల‌తో మాత్రం గంభీర్ వేడి రేపుతూ ఉంటాడు. అవ‌న్నీ క్రికెట్, సెల‌బ్రిటీల వ్య‌వ‌హారాలే.

కొహ్లీ టీమిండియా కెప్టెన్ గా ఉన్నంత సేపూ అత‌డిని నిందించ‌డానికి గంభీర్ త‌న స‌మ‌యాన్ని బాగా కేటాయించేవాడు. కొహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఐసీసీ టోర్నీలేవీ సాధించ‌డం లేద‌నేవాడు. అలాగే బెంగ‌ళూరు ఐపీఎల్ జ‌ట్టు కెప్టెన్ గా కూడా కొహ్లీ తీరును అనునిత్యం విమ‌ర్శించేవాడు. ఇరువురూ జాతీయ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రోజుల నుంచినే వీరిద్ద‌రి మధ్య‌నా విబేధాలుండేవి.

ఆ సంగ‌త‌లా ఉంటే.. ఇప్పుడు గంభీర్ మ‌ళ్లీ క్రికెట్ వ్య‌వ‌హారాల్లోకి ప్ర‌త్య‌క్షంగా దిగుతున్నాడు. ఐపీఎల్ లో కొత్త‌గా వ‌స్తున్న ల‌క్నో జ‌ట్టుకు గంభీర్ మెంట‌ర్ గా ప‌ని చేయ‌నున్నాడు. ఈ మేర‌కు ఒప్పందం కుదిరిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ జ‌ట్టుకు ఆండీఫ్ల‌వ‌ర్ ఫుల్ టైమ్ కోచ్ గా ప‌ని చేయ‌నుండ‌గా, మెంట‌ర్ గా గంభీర్ రంగంలోకి దిగుతున్నాడట‌.

మ‌రి మాజీ క్రికెట‌ర్ గా గంభీర్ మెంట‌ర్ గా ఏ మేర‌కు ప‌ని చేస్తాడో వేరే సంగ‌తి. గంభీర్ లాంటి ఆవేశ‌ప‌రుడు యువ ఆట‌గాళ్ల‌కు సూచ‌న‌లు, స‌ల‌హాలు ఏ మేర‌కు ఇస్తాడ‌నేది వేరే చ‌ర్చ కానీ, ఎంపీ హోదాలో ఉంటూ.. మ‌ళ్లీ ఇలా ప్ర‌త్యక్ష క్రికెట్ వ్య‌వ‌హారాల వైపు వెళ్ల‌డం ఏమిట‌నేది అస‌లైన చ‌ర్చ‌. మ‌రో రెండేళ్ల‌లో ఎన్నిక‌లు కూడా ఉన్నాయి. ఒక‌వైపు ప్ర‌ధాన‌మంత్రి మోడీనే బీజేపీ ఎంపీల‌తో స‌మావేశం అవుతూ… వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం గురించి చ‌ర్చ‌లు సాగిస్తూ ఉన్నారు. టిఫిన్ పే చ‌ర్చ అంట అది. అయితే ఈ బీజేపీ ఎంపీ మాత్రం క్రికెట్ వ్య‌వ‌హారాల్లోకి ఎంట‌ర‌వుతున్నట్టున్నాడు!