అస్తిత్వం, ఆస్తి పోరాటం మధ్య అమరావతి నలిగిపోతోంది. రాజధాని కోసమని 33 వేల ఎకరాల భూమిని త్యాగం చేశామని, ఇప్పుడు ఇక్కడి నుంచి తరలిస్తే ఎలా అని? అమరావతి రైతులు ప్రశ్నిస్తున్నారు. కేవలం 29 గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్రం మొత్తాన్ని ఎండపెడతారా? అని మరోవైపు నిలదీతలు. రాజధాని కోసం భూములను త్యాగం చేశారనే వాదనను మెజార్టీ సమాజం అంగీకరించడం లేదు.
ఉదాహరణకు ఎక్కడైనా ప్రభుత్వ పాఠశాలో, వైద్యశాలో కట్టాలని నిర్ణయించారని అనుకుందాం. అందుకోసం భూమిని విరాళంగా ఇస్తే, వారి కుటుంబ సభ్యులు సూచించిన పేర్లను పెట్టడం చూశాం. ఇక భూమి దానం చేసిన వ్యక్తులకు ప్రభుత్వం తిరిగి డబ్బు చెల్లించే ప్రశ్న ఉత్పన్నం కాదు. త్యాగం, దానం, విరాళం అంటేనే ఎలాంటి ప్రయోజనాలు ఆశించకపోవడం. కానీ రాజధానికి వేలాది ఎకరాల భూముల్ని త్యాగం చేశామని, చేశారని చెబుతున్న వాళ్లు… తాము ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మాటేంటి? రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రైవేట్ భూమిని డెవలప్ చేయడానికి ఏ రకమైన ఒప్పందం కుదుర్చుకుంటారో, అలాంటి ఒప్పం దాన్ని నాటి చంద్రబాబు ప్రభుత్వంతో చేసుకున్నారనేది వాస్తవం.
ఈ వాస్తవాల్ని చెప్పకుండా, మిగిలిన విషయాలు ఎన్ని చెప్పినా ప్రయోజనం లేదు. పరిపాలన రాజధాని మార్చడం వల్ల తమ భూముల విలువ అమాంతం పడిపోతుందనే నిజాన్ని బయటికి చెప్పలేక, ఇతరేతర గోడు వెల్లబోసుకుంటూ, ఊరూరూ తిరుగుతున్నారు. మరీ ముఖ్యంగా రాజధానికి భూములిచ్చిన వాళ్లలో చాలా మంది అమ్ముకున్నారనే వాస్తవాలు ఇప్పు డిప్పుడే బయటికొస్తున్నాయి. ఇప్పుడు అక్కడ భూములు కొన్న వాళ్ల యాగీనే ఇదంతా అని విమర్శలున్నాయి. అందుకే అమ రావతిది ఆస్తి పోరాటం అని చెప్పడం. ఆశల్ని ప్రభుత్వం తీరుస్తుందే తప్ప, అత్యాశల్ని నెరవేర్చడం ఏ ప్రభుత్వానికి చేతకాదు.
కానీ వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలది అస్తిత్వ పోరాటం. బతుకుదెరువు కోసం ఉన్న ఊరిని, కన్నవారిని విడిచి పెట్టి వేల మైళ్ల దూరం వలస వెళుతుండడం అందరికీ తెలిసిందే. ఆ ప్రాంతాలకు కనీసం ఒక పంట పండించుకోడానికి సాగునీళ్లు అందిస్తే… స్వస్థలాల్లోనే మనుగడ సాగిస్తారు. ఆ దిశగా పాలకులు ఆలోచించడం లేదు. మరీ ముఖ్యంగా రాయలసీమ విషయా నికి వస్తే తమిళనాడు నుంచి విడిపోయే సందర్భంలో శ్రీబాగ్ ఒప్పందం చేసుకున్నారు.
ఆ ఒప్పందం ప్రకారం రాయలసీమకు హైకోర్టు లేదా రాజధాని ఇవ్వాలి. ఆ ప్రకారమే గతంలో కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేశారు. అనంతరం ఒకే భాష మాట్లాడ్తారనే ప్రాతిపదికగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను కలపడం వల్ల నష్టపోయింది సీమ ప్రాంతమే. తమ ప్రాంతంలోని బళ్లారిని కోల్పోవాల్సి వచ్చిందని సీమ సమాజం ఇప్పటికే వాపోతోంది. అంతేకాదు, కర్నూలును రాజధానిగా కోల్పోవడంతో తాము చాలా నష్టపోయామని మధనపడుతున్నారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవేవీ పట్టించు కోకుండా ఏకపక్షంగా అమరావతినే రాజధానిగా నిర్ణయించారనే ఆవేదన సీమలో కనిపిస్తోంది. తమ ఆకాంక్షలను పరిగణలోకి తీసుకోలేదనే ఆవేదన సీమ సమాజంలో బలంగా ఉంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో శ్రీబాగ్ ఒప్పందం గురించి అసెంబ్లీలో ప్రస్తావించడంతో మళ్లీ ఆశలు చిగురించాయి.
తమ ప్రాంత అస్తిత్వాన్ని గుర్తిస్తూ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న కీలక నిర్ణయాలపై ఆ ప్రాంతం హర్షిస్తోంది. అయితే అభివృద్ధి, అధికార వికేంద్రీకరణలో ప్రభుత్వం ముందడుగు వేయకుండా వ్యవస్థల్ని అడ్డు పెట్టుకుని ప్రతిపక్షాలు కుట్రలకు పాల్పడుతుండడంతో సీమ సమాజం ఆగ్రహంగా ఉంది. అందుకే మరోసారి సీమ, ఉత్తరాంధ్రలో అస్తిత్వ పోరాటాలు మరోసారి పురుడు పోసుకుంటున్నాయి. మున్ముందు ఏం జరగనుందో కాలమే తేల్చాల్సి వుంది.