అమరావతి పాదయాత్ర ముగిసింది. చంద్రబాబు లేదా లోకేష్ కు రాజకీయ పాదయాత్ర సాగించాలని, జనాల మనసు మార్చడానికి ప్రయత్నించాలని వుంది. కానీ జనం ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. అలాగే ఎన్నికలు ఇంకా రెండున్నరేళ్ల దూరంలో వుండగా, ఇప్పటి నుంచి పాదయాత్ర చేసేస్తే, తరువాత చేయడానికి ఏం వుండదనే భావన మరోపక్క వెనక్కు లాగాయి.
ఇలాంటి టైమ్ వచ్చిన ఐడియా కావచ్చు. తమ తరపున కావచ్చు, అమరావతి తరపున కావచ్చు, రైతుల పాదయాత్ర సాగిస్తే బాగుంటుంది కదా? అమరావతి నుంచి తిరుపతి వరకు వున్న ప్రాంతాలు అన్నింటిలో కాస్త జగన్ ప్రభుత్వం పై నెగిటివిటీని ఇప్పటి నుంచే స్ప్రెడ్ చేయించవచ్చు అనే ఐడియా వచ్చి వుంటుంది. మొత్తానికి అందరూ కలిసి పాదయాత్రకు రూపకల్పన చేసారు.
అందరూ కలిసి అనడం ఆరోపణ కాదు. ఎందరో కలవకపోతే ఈ యాత్ర సాధ్యం కాదు. ప్రయాస సంగతి అలా వుంచితే అపార వ్యయం తో కూడిన ఈ యాత్రకు ఎవరు ఎంత వరకు ఆర్థికంగా సహరించారన్నది యాత్ర నిర్వాహకులకే తెలియాలి. అదే విధంగా యాత్రను వీలయినంత ఎక్కువగా ప్రొజెక్ట్ చేయడానికి తెలుగుదేశం అనుకూల మీడియా ఎంత కిందా మీదా పడిందో కూడా తెలిసిందే. ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి అనుకూలం తప్ప వేరు కాదు.
చంద్రబాబు లేదా లోకేష్ ఎవరు పాదయాత్ర చేసినా, అమరావతి రైతులు చేసినా అది జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్ప వేరు కాదు. అందువల్ల యాత్ర ప్రయోజనం రైతుల కన్నా తెలుగదేశానికే ఎక్కువ అన్నది వాస్తవం. తెలుగుదేశానికి ఉపయోగ పడితే అది రైతులకు ఉపయోగపడినట్లే.
సరే, అమరావతి యాత్ర సగంలో వుండగానే మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నారు. మరింత పటిష్టంగా మళ్లీ ప్రవేశ పెడతాం అన్నారు. ప్రవేశ పెడతారా? పెట్టరా అన్నది పక్కన పెడితే, రాబోయే ఎన్నికల ముందు మేనిఫెస్టో లో మూడు రాజధానులు అన్న పాయింట్ వైకాపా వైపు నుంచి వుంటుంది. అది పక్కా. మరి అదే సమయంలో మూడు రాజధానులు కాదు ఒకటే రాజధాని అని తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో నొక్కి వక్కాణించాల్సి వుంటుంది. కంటితుడుపుగా అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్రకు అది చేస్తాం, సీమకు ఇది చేస్తాం అని ఏవోవో పెడతారు. కానీ అవన్నీ రాజధాని అనే దానికి సాటి వస్తాయా? జనం రాజధాని సెంటి మెంట్ ను సైలంట్ గా చూపిస్తారా? అన్నది ఎన్నికల తరువాత కానీ తెలియదు.
ఈలోగా జగన్ ప్రభుత్వానికి ఓ వెసులు బాటు చిక్కింది. విశాఖలో ఏం నిర్మాణం చేయాలన్నా కోర్టు కేసులు అడ్డం పడతాయి. ఇప్పుడు ఇక మూడు రాజధానుల ప్రతిపాదనే ఉపసంహరించుకున్నారు కాబట్టి విశాఖలో ఏ నిర్మాణం చేపట్టినా దానికి ఏ అడ్డంకి రాదు. సిఎమ్ క్యాంప్ ఆఫీసు కట్టినా, కార్యాలయాలు కట్టినా ఏ అభ్యంతరం రాదు. అలాగే కొన్ని కార్యాలయాలు అక్కడ కొత్తగా ఏర్పాటు చేసినా అడ్డం రావడం కష్టం. మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే తప్ప అమరావతి పైకి లేవదేమో అని ఎదురుచూడ్డం తప్ప వేరే మార్గం వుండదు. అలా అని అమరావతిని పూర్తిగా వదిలేయకుండా ఏదో ఒకటి చేస్తూ వుంటుంది ప్రభుత్వం.
కానీ ఇక ఇప్పుడు అమరావతి రైతులు ఏం చేస్తారు? రోజుల తరబడి నిరసన అయిపోయింది. పాదయాత్ర అయిపోయింది. పోనీ ఈసారి సీమ వైపు కాకుండా ఆంధ్ర వైపు యాత్ర సాగిద్దాం అంటే బిల్లు ఉపసంహరించుకున్నారు. అందువల్ల ఇక రెండున్నరేళ్లు అమరావతి రైతులు మౌనంగా వుండడం మినహా చేసేదేమీ లేదు.
ఇదిలా వుంచితే అమరవాతి సభలో కొత్త గొంతులు ఏమైనా వినిపిస్తే అది వేరుగా వుండేది. అక్కడ వినిపించినవి అన్నీ పాత గొంతులే. అవన్నీ చిరకాలంగా జగన్ కు వ్యతిరేకంగా వినిపిస్తూ వస్తున్నవే. నారాయణ, శివాజీ ఇలాంటి గొంతులు అన్నీ అరిగిపోయిన రికార్డులే. తెలుగుదేశం పార్టీ సంగతి సరేసరి. రామకృష్ణం రాజు అయితే జనాలకు అలవాటు అయిపోయింది.
అందుకే ముగింపు సభ పెద్దగా హిట్ కాలేదు. యాతలో పాల్గోన్న జనం, సమీకరణ చేసిన జనం తప్పితే, మాటల తూటాలు ఏమీ కొత్తగా పేలలేదు. ఇక మిగిలింది ఏమిటంటే తెలుగుదేశం పార్టీ నేరుగా రంగంలోకి దిగి పాదయాత్ర సాగించడం. ఓ ఏడాది ముందుగా లోకేష్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు లేదా పవన్ కళ్యాణ్ కావచ్చు పాదయాత్రకు దిగాల్సి వుంటుంది. కానీ సమస్య ఏమిటంటే అదే సమయానికి జగన్ కూడా దిగే అవకాశం వుంటుంది
మూడు రాజధానులు అన్నాడు అడ్డం పడ్డారు.
ఇళ్ల స్థలాలు అన్నాను అడ్డం పడ్డారు.
ఫీజులు అమ్మలకే ఇచ్చి కడదాం అనుకుంటే కుదరలేదు
ఇలా తను అనుకున్నవి, తనకు అడ్డం పడిన వైనం అన్నీ ఏకరువు పెట్టుకుంటూ వెళ్తారు.
అటు ప్రతిపక్షం ఒకటిరెండు పాయింట్ల దగ్గర ఆగాల్సి వుంటుంది. అప్పుల పాలు అయింది, ఆర్థికంగా దివాళా తీసింది. చీప్ లిక్కర్ బ్రాండ్ లు అమ్మారు. ఇలాంటివి మాత్రమే.
అప్పుడు ఇటు యాత్ర, డైలాగులు అటు యాత్ర డైలాగుల బ్యాలన్స్ అయిపోతే పెద్దగా ప్రయోజనం వుండకపోచ్చు.
మొత్తం మీద అమరావతి యాత్ర ను ముందుగా ప్లాన్ చేసేసి, ఓ నెల పాటు మీడియాలో మైలేజీ తెచ్చుకున్నారు తప్ప, తరువాత ఏంటీ అన్నది ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచించి ఏదో ఒకటి చేయాలి లేకుంటే మళ్లీ వాక్యూమ్ వచ్చేస్తుంది.