పేరుకే ప్రజాస్వామ్య దేశం

మనది పేరుకే ప్రజాస్వామ్య దేశంగాని ఇప్పటికీ ఎక్కువగా రాచరిక, జమీందారీ, పెత్తందారీ పోకడలే కనబడతాయి. ఈ వ్యవస్థలు అంతరించిపోయినప్పటికీ వాటి అవశేషాలను మన పాలకులు, నాయకులు ఇంకా మోసుకొని తిరుగుతున్నారు. అయితే దేశానికి స్వాతంత్య్రం…

మనది పేరుకే ప్రజాస్వామ్య దేశంగాని ఇప్పటికీ ఎక్కువగా రాచరిక, జమీందారీ, పెత్తందారీ పోకడలే కనబడతాయి. ఈ వ్యవస్థలు అంతరించిపోయినప్పటికీ వాటి అవశేషాలను మన పాలకులు, నాయకులు ఇంకా మోసుకొని తిరుగుతున్నారు. అయితే దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు పరిపాలన చేసిన నాయకుల్లో రాచరిక పోకడలు ఉన్నాయా అంటే దాదాపుగా లేవనే చెప్పాలి. నడమంత్రపు సిరిలాగా ఈ రాచరిక, జమీందారీ పోకడలు కాల క్రమంలో మళ్ళీ మొలకెత్తాయి. అవి ఇప్పుడు మానులై వేళ్ళూనుకున్నాయి.

పాలకులు తాము చేసిన చట్టాలను తామే అతిక్రమిస్తారు. తాము పెట్టిన నిబంధనలను తామే ఉల్లంఘిస్తారు. దేన్నీ లెక్క చేయరు. ఎవరినీ పట్టించుకోరు. ఎవరైతే నాకేంటి అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. రాచరికంలో, జమీందారీ వ్యవస్థలో మాదిరిగా తమ మాట కాదన్నవారిని, తమను వ్యతిరేకించేవారిని అణచివేసే ధోరణి పెరిగిపోయింది. 

మంచి చెప్పినా వినే పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యమంత అరాచకం మరొకటి లేదు … ప్రజాస్వామ్యానికి మరో ప్రత్యామ్నాయం లేదు అన్నాడో పెద్ద మనిషి. ప్రజాస్వామ్యం కావాలనుకుంటున్నాం కాబట్టి అది ఎంతటి అరాచకంగా ఉన్నా భరించాల్సిందే.

నైతిక ప్రవర్తనలో మనకంటే కొన్ని చిన్న దేశాలు చాలా ఉన్నతంగా ఉన్నాయనిపిస్తోంది. మన ప్రజాస్వామ్యంలో పాలకులు, ప్రజలు సమానం కాదు. ప్రజలచేత …ప్రజల కొరకు … ప్రజల వల్ల అనే మాటలు బూటకమని అనిపిస్తుంది. ఇంత సోది ఎందుకు చెప్పుకున్నామంటే మన దేశాన్ని మరో దేశంతో పోల్చి చెప్పాలనుకున్నప్పుడు సోదీ అనండి, ఉపోద్ఘాతం అనండి అవసరం. అసలు విషయమేటంటే ….

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. భారత్ లో కాస్త ఎక్కువగానే ఉంది. దీంతో కరోనా నియంత్రణకు కొన్ని దేశాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. కేసులు ఎక్కువగా ఉన్న దేశాల్లో  థాయ్ లాండ్ ఒకటి. ఆ దేశం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. మాస్కు తప్పనిసరి ధరించాలని ఆదేశించింది. మాస్కు లేకుండా బహిరంగ ప్రదేశాల్లోకి వస్తే 20 వేల భట్‌లు (భారత కరెన్సీలో దాదాపు 48 వేల రూపాయల) వరకు జరిమానా విధించాలని నిర్ణయించింది. సోమవారం నుంచి ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి. 

నిబంధనలు అమల్లోకి వచ్చిన తరువాత ఆ దేశ ప్రధాని వ్యాక్సినేషన్ కు సంబందించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారంతా మాస్క్ ధరించారు. కానీ సమావేశం నిర్వహించిన ప్రధాని ప్రయుత్‌ చాన్‌-ఓచా మాత్రం మాస్క్ పెట్టుకోలేదు. ఈ ఫోటోలను ప్రధాని వ్యక్తిగత సిబ్బంది సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో విషయం వెలుగుచూసింది.

ప్రధానే మాస్క్ పెట్టుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాని మాస్క్ పెట్టుకోకుండా నిబంధన ఉల్లంఘించాడు కాబట్టి అతడికి జరిమానా విధించారు అధికారులు. ఇది ఆయన తొలి ఉల్లంఘన కాబట్టి 6 వేల భట్‌లు (రూ.14,250) జరిమానా వేశారు. 

ఈ విషయంపై బ్యాంకాక్‌ నగర గవర్నర్‌ అశ్విన్‌ క్వాన్‌మువాంగ్‌ స్పందించారు. ప్రధాని నుంచి దర్యాప్తు అధికారులు జరిమానా వసూలు చేశారని తెలిపారు. ఇలాంటిది మన దేశంలో జరుగుతుందా ? పాలకుల నుంచి జరిమానా వసూలు చేసే ధైర్యం అధికారులకు ఉంటుందా? ఇప్పుడు చాలామంది నాయకులు, పాలకులు కరోనా నిబంధనలు పాటించకుండానే తిరుగుతున్నారు. 

అధికారులు వారిని ఏమైనా అనగలుగుతున్నారా ? కొంతకాలం కిందట పాత బస్తీలో ఓ ఎమ్మెల్యే తమ దగ్గర చట్టాలు పనిచేయవని, పన్నులు వసూలు చేస్తే ఊరుకోమని బహిరంగంగానే చెప్పాడు. మన రాజ్యాంగమే పాలకులను దైవంశ సంభూతులుగా భావించి వారికి అనేక మిహాయింపులు ఇచ్చింది. అయినప్పటికీ నాయకులు, పాలకులు అడ్డదారులు తొక్కుతూనే ఉంటారు. మనది ప్రజాస్వామ్య దేశం కదా ఇలాగే ఉంటుంది.