మాకు ప్రభుత్వం నుంచి అందిన సహాయం నామమాత్రమే, అంతా మేమే చేసుకున్నాం,అందువల్ల మా సాంకేతికతను వేరే వాళ్లతో పంచుకునేది లేదు అంటూ కోవాగ్జీన్ కుండ బద్దలు కొట్దింది కొన్ని రోజుల క్రితం. మరోపక్క కోవిడ్ వ్యాక్సీన్ లకు మేధో హక్కులు సరి కాదనే భారత్ డిమాండ్ కు ప్రపంచవాప్తంగా మద్దతు పెరుగుతోంది.
ఇలాంటి నేపథ్యంలో కోవాగ్జీన్ కూడా దిగివచ్చింది. తమ సాంకేతికతను రెండు ప్రభుత్వ సంస్థలతో పంచుకోవడానికి ఒప్పందాలు కుదుర్చుకుంది. భారత్ ఇమ్యూనోలాజికల్స్ అండ్ బయోలాజికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ , ఇండియన్ ఇమ్యూలాజికల్స్ లిమిటెడ్ సంస్థలకు తన సాంకేతికను కోవాగ్జీన్ బదిలీ చేయనుంది.
అలాగే మహరాష్ట్రకు చెందిన హాఫ్ కిన్ అనే ప్రయివేట్ ఫార్మా కంపెనీతో కూడా ఉత్పత్తి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే కుదిరిన ఒప్పందాలు ఏమిటో? ఇది కోవాగ్జీన్ కు ఏ మాత్రం లాభమో, నష్టమో అన్న వివరాలు మాత్రం బయటకు రాలేదు. కానీ ఒక విషయం మాత్రం వెల్లడయింది.
ఈ మూడు సంస్థలకు కోవాగ్జీన్ ఉత్పత్తి కోసం కేంద్రం భారీగా ఆర్థిక సహాయం అందిస్తుంది. సాంకేతిక బదిలీకి ససేమరా అన్నా కోవాగ్జీన్ ఇప్పుడు ఒకె అనడం వెనుక ఏమిటన్నది ఈ ఒప్పందాల వివరాలు బయటకు వస్తే తెలుస్తుంది.