పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వైసీపీ ప్రభుత్వంపై మాజీ జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు వింటుంటే… నోరెలా వస్తోందయ్యా సామి అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు హయాంలో తాను జలవనరులశాఖ మంత్రిగా అసెంబ్లీలో విసిరిన సవాల్‌ను నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
“జగన్ నీ సాక్షి పత్రికలో రాసి పెట్టుకో. 2018 కల్లా గ్రావిటీ ద్వారా పోలవరం నుంచి సాగునీళ్లు అందిస్తాం. 2019 నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తాం. పోలవరం పూర్తయితే జగన్‌మోహన్‌రెడ్డికి పుట్టగతులుండవ్” అని చట్టసభ వేదికగా నాడు దేవినేని ఉమా ప్రగల్భాలు పలికారని సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.
ఈ పెద్ద మనిషి తాజాగా జగన్ సర్కార్‌పై విమర్శలు గుప్పించడం ఆశ్చర్యంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టును నిన్న జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి వచ్చే ఏడాది ఖరీఫ్ సీజన్‌కు నీరిస్తామని అనిల్‌కుమార్ స్పష్టం చేశారు.
కరోనా ప్రభావం వల్ల ఏప్రిల్ నాటికి 17 వేల కుటుంబాలను పునరావాసాలకు తరలించేందుకు సిద్ధం చేసినప్పటికీ కార్మికుల సమస్య వల్ల వీలు పడలేదన్నారు. ఈ నేపథ్యంలో దేవినేని ఉమా మీడియా ముందుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పడకేయించినందుకు వైసీపీ నేతలు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి డిమాండ్ చేయడం గమనార్హం.
పోలవరంలో 72 శాతం పనులు పూర్తి చేసి మిగిలిన పనిని ఈ ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వం అప్పగించిందన్నారు. ఈ ఏడాది జూన్ నాటికి మొత్తం పనులు పూర్తి చేస్తామని జగన్ ప్రభుత్వం బీరాలు పలికిందని విమర్శించారు. ఎక్కడ పని అక్కడే ఉందని ఆయన ఆరోపించారు.కనీసం నిర్వాసితులకు పరిహారం కూడా చెల్లించలేక పోయారని విమర్శించారు.
కనీసం నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా తన ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఎలా పాలించిందో దేవినేని ఉమామహేశ్వరరావే సమాధానం చెప్పాలనే కామెంట్స్ వస్తున్నాయి. నీ సాక్షి పత్రికలో రాసి పెట్టుకో జగన్ అనే అహంకారపూరిత మాటల సంగతేంటని నెటిజన్లు నిలదీస్తున్నారు.
తగదునమ్మానని ఇప్పుడు జగన్ సర్కార్ క్షమాపణ చెప్పాలని ఏ మొహం పెట్టుకుని దేవినేని ప్రశ్నిస్తున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. బాబు హయాంలో పోలవరం పనులు… అన్నీ కాగితాలకే తప్ప క్షేత్రస్థాయిలో కాదని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.