సామాన్యులకు పదవులు కట్టబెట్టడంలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరిపిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాలు వ్యాపారమయమైన ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్యులకు పదవులు కట్టబెట్టడంలో జగన్ చూపుతున్న చొరవ ప్రశంసలు అందుకుంటోంది. నందిగం సురేష్ లాంటి ఓ సాధారణ కార్యకర్తకు బాపట్ల ఎంపీ టికెట్ కేటాయించి, గెలిపించి దేశ అత్యున్నత చట్ట సభల్లో కూచోపెట్టిన ఘనత జగన్‌కు దక్కింది.
ఇటీవల తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక సీటును కూడా అదే రకంగా కట్టబెట్టారు. డాక్టర్ గురుమూర్తి అనే ఓ అతి సాధారణ యువకుడికి కేటాయించి, అత్యధిక మెజార్టీతో గెలిపించారు. బహుశా కలలో కూడా ఎంపీ కావాలనే కలను కనేందుకు గురుమూర్తి సాహసించి ఉండరు. అలాంటిది జగన్ ఆశీస్సులతో అత్యున్నత పదవి గురుమూర్తిని వరించింది.
అసలు కలలో కూడా ఊహించని ఉన్నత పదవులను సామాన్యులకు కట్టబెట్టడం ద్వారా తాను ఎవరి పక్షమో ముఖ్యమంత్రి చేతల ద్వారా నిరూపించుకున్నారు. ఆ మధ్య ఎమ్మెల్సీ పదవుల కేటాయింపుల్లో కూడా జగన్ తనది పేదల, సామాన్యుల పక్షమే అని మరోసారి నిరూపించుకున్నారు.
విజయవాడకు చెందిన కరీమున్నీసా అనే మైనార్టీ మహిళా కార్యకర్త, డివిజన్ స్థాయి నాయకురాలికి ఏకంగా ఎమ్మెల్సీ పదవి కేటాయించి ఆశ్చర్యపరిచారు. చివరికి ఆ పదవి పొందిన కరీమున్నీసానే ఇది కలా? నిజమా? అనే అయోమయానికి గురి అయ్యారంటే… జగన్ నిర్ణయాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. పార్టీని నమ్ముకుంటే సామాన్యులకైనా పదవి వెతు క్కుంటూ వస్తుందనేందుకు కరీమున్నీసా ఎంపికే నిలువెత్తు నిదర్శనం.
కరీమున్నీసా 2014లో విజయవాడ 54వ డివిజన్ కార్పొరేటర్‌గా వైసీపీ తరపున గెలుపొందారు. ఆ తర్వాత డివిజన్ల పునర్వి భజనలో భాగంగా 54వ డివిజన్ 59వ డివిజన్ అయింది. ఇటీవల జరిగిన కార్పొరేషన్ల ఎన్నికల్లో ఆ డివిజన్ నుంచి మరోసారి ఆమె బరిలో నిలిచి, ఎన్నికల ప్రచారంలో ఉండగా ముస్లిం మైనార్టీ మహిళా కోటా కింద ఎమ్మెల్సీ పదవి ఇచ్చారనే శుభవార్త అందింది. జగనే స్వయంగా తన పేరును ఖరారు చేయడంపై కరీమున్నీసాతో పాటు ఆమె కుటుంబం ఆనందానికి అవధుల్లేవు.
ఈ నేపథ్యంలో జగన్ అలాంటి మరో నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటాలో రమేశ్ యాదవ్ అనే ఓ వార్డు సభ్యుడికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు నిర్ణయించారు. ఈ మేరకు నిన్న సీఎంను రమేశ్ యాదవ్‌తో పాటు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి కలిశారు. రమేశ్ యాదవ్‌కు ఎమ్మెల్సీ ఇవ్వనున్నట్టు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అధికారికంగా ప్రకటించారు. ఇక అధికారిక ప్రకటన ఒక్కటే మిగిలి ఉంది.
ప్రొద్దుటూరు మున్సిపాలిటీ 11వ వార్డు కౌన్సిలర్ రాచగొళ్ల రమేశ్‌యాదవ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రమేశ్ యాదవ్ తండ్రి వెంకటసుబ్బయ్య గతంలో మున్సిపల్ చైర్మన్‌గా పనిచేశారు. రమేశ్ కుటుంబానికి ప్రొద్దుటూరు పట్టణంలో మంచి పేరు ఉంది. దీంతో రమేశ్ యాదవ్‌ను మున్సిపల్ చైర్మన్ పదవికి ఎమ్మెల్యే ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సామాజిక వర్గాల వారీగా పదవులు కేటాయించాలనే కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రమేశ్ యాదవ్‌కు ప్రొద్దుటూరు చైర్మన్ గిరి అంందినట్టే అంది చేజారింది. దీంతో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేపై విమర్శలు చేశాయి.
ఈ నేపథ్యంలో రమేశ్ యాదవ్‌కు చైర్మన్ కంటే పెద్ద పదవిని ఇప్పిస్తానని మాట ఇచ్చారు. అది ఎమ్మెల్సీ రూపంలో రమేశ్ యాదవ్‌ను వరించనుంది. ఇదే చంద్రబాబు టీడీపీ పగ్గాలు చేపట్టిన తర్వాత సామాన్యులకు పదవులు కట్టబెట్టిన చరిత్ర లేదు. అంతా కార్పొ”రేట్” మాయ. కానీ జగన్ అలా కాదని ఇప్పటికే నిరూపించుకున్నారు.
ఈ నెల 10న ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి సంబంధించి రమేశ్ యాదవ్ పేరు ప్రతిపాదించనుంది. 14వ తేదీలోపు రమేశ్‌యాదవ్ ఎమ్మెల్సీ కానున్నారు. ఎవరూ ఊహించని విధంగా సామాన్యులకు పదవులు కట్టబెట్టడంలో ఎన్టీఆర్‌ను జగన్ మించిపోయారనే టాక్ విస్తృతంగా వినిపిస్తోంది.