ఆన్ లైన్లో ఆనందయ్య మందు.. మోసానికి మరో మార్గం

“ఫ్లాష్ ఫ్లాష్.. .రాష్ట్ర ప్రభుత్వం అనందయ్య మందుకు వెబ్ సైట్ ఓపెన్ చేసింది.. కరోనాకు మందు కావాల్సిన వాళ్లు వెంటనే ఈ లింక్ క్లిక్ చేసి ఆన్ లైన్లో బుక్ చేసుకోండి. ముందుగా ఎవరు…

“ఫ్లాష్ ఫ్లాష్.. .రాష్ట్ర ప్రభుత్వం అనందయ్య మందుకు వెబ్ సైట్ ఓపెన్ చేసింది.. కరోనాకు మందు కావాల్సిన వాళ్లు వెంటనే ఈ లింక్ క్లిక్ చేసి ఆన్ లైన్లో బుక్ చేసుకోండి. ముందుగా ఎవరు బుక్ చేసుకుంటే వాళ్లకే మందు.” 2 రోజులుగా ఎంతోమంది మొబైల్స్ కు ఈ లింక్ వచ్చి ఉంటుంది. పొరపాటున ఓపెన్ చేశారంటే.. మీ ఎకౌంట్లో డబ్బులు మాయమవ్వడం ఖాయం.

ఇలా సైబర్ నేరగాళ్లు ఆనందయ్య మందును కూడా తమ మోసాలకు వాడుకుంటున్నారు. ప్రజల అవసరాన్ని ఆసరాగా తీసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. అసలు ఇంతకీ ఈ ఫేక్ సైట్ ఓపెన్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం.

మందు కావాల్సిన వాళ్లు ముందుగా తమ పేరు, మొబైల్ నంబర్, ఆధార్ కార్డు నంబర్ నమోదు చేయాల్సిందిగా ఫేక్ వెబ్ సైట్ అడుగుతుంది. అది నమోదు చేసిన తర్వాత క్రెడిట్ కార్డు డీటెయిల్స్ లేదా బ్యాంక్ ఖాతా నంబర్ అడుగుతుంది. తర్వాత మొబైల్ కు వచ్చిన నంబర్ ను ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతున్నారు. చాలామంది తెలియక ఇక్కడే పొరపాటు చేస్తున్నారు.

మరికొన్ని సైట్లకు సంబంధించి డీటెయిల్స్ నమోదుచేసిన వెంటనే కాల్ చేస్తున్నారు. ఫలానా సెక్రటేరియట్ నుంచి మాట్లాడుతున్నామని, అడిగిన వివరాలు టకటకా చెప్పాలంటూ కీలకమైన సమాచారం దొంగిలిస్తున్నారు.

ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఆనందయ్య కరోనా మందును ఆన్ లైన్లో పంపిణీ చేసే అంశానికి సంబంధించి ఇంకా ఎలాంటి విధివిధానాలు ఖరారు చేయలేదు ప్రభుత్వం. ఈ విషయం తెలియని చాలామంది నకిలీ వెబ్ సైట్స్ ను క్లిక్ చేసి కీలక సమాచారాన్ని సైబర్ నేరగాళ్ల చేతికి అందిస్తున్నారు.

ఆన్ లైన్ విధానంలో మందు పొందే విధానంపై అధికారులు సరైన అవగాహన కల్పించకపోవడంతో ఈ సమస్య ఎదురైంది. దీనికితోడు టీవీ మీడియా అత్యుత్సాహం కూడా దీనికి ప్రధాన కారణం. ఇదే అధికారిక సైట్ అంటూ కొన్ని ప్రధాన మీడియా ఛానెళ్లు ప్రచారం చేయడం సమస్యను మరింత పెంచింది.

ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏంటంటే.. ఆనందయ్య మందు ఇంకా తయారుకాలేదు. ఆదివారం నుంచి ఆనందయ్య ఈ మందును తయారుచేస్తారు. అది సోమవారం నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. మంగళవారం నుంచి ఆన్ లైన్లోకి కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ లోగా వెబ్ సైట్, యాప్, కాల్ సెంటర్ కు సంబంధించిన సమాచారాన్ని అధికారులు అఫీషియల్ గా ప్రకటిస్తారు.