బహుళజాతి ఫుడ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ నెస్లే తయారుచేసే పలు ఉత్పత్పుల విషయంలో అప్పుడు, అప్పుడు ఏదో ఒక పరిశోధన, నివేదిక బయటకు వస్తూనే వున్నాయి. ఆ సంస్థ నష్ట నివారణ చర్యలు తీసుకుంటూనే వుంది. కానీ ప్రచారం మోజు భయంకరంగా వుండడం వల్ల జనాలు వాటిని కొంటూనే వున్నారు. లేటెస్ట్ గా ఓ సంచలన విషయం బయటకు వచ్చింది.
ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్ స్టాంట్ ఫుడ్స్ తయారుచేసే సంస్థ నెస్లే. చిన్నపిల్లల సిరియల్స్, పాల పదార్థాల నుంచి, కిట్ కాట్, మంచ్ చాక్ లేట్లు, మ్యాగీ నూడుల్స్, కాఫీ ఇలా రకరకాల పదార్థాలు దీని తయారీ జాబితాలోవున్నాయి. వీటిలో అరవై శాతం వరకు ఆరోగ్యకరమైనవి కావని, కంపెనీ తయారీ ఫార్ములాలో మార్పులు చేర్పులు చేసినా, పెద్దగా ఫలితం వుండదని తెలిసినట్లు, ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక వెల్లడించింది.
ఇంతకీ ఈ పత్రికకు ఈ సమాచారం ఎలా తెలిసింది అంటే నెస్లే సంస్థ అంతర్గతంగా తయారుచేసిన నివేదిక ఆధారంగానే తాము ఈ సమాచారం తెలుసుకున్నట్లు ఆ పత్రిక తెలిపింది. సరైన చర్యలు తీసుకుని, పుష్టికరమైన, ఆరోగ్య కరమైన ఉత్పత్తులు అందించాలని కంపెనీ తన అంతర్గత నివేదిక లో పేర్కోందట. దానిని ఫైనాన్షియల్ టైమ్స్ బయటకు తెచ్చింది.
నెస్లే ప్రొడక్ట్స్ మీద గతంలో కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి. కానీ కంపెనీ ప్రకటనల హోరు పెంచి నష్ట నివారణ చర్యలు తీసుకుంది. జనం కొంటూనే వున్నారు.