విడిపోయిన ఐఏఎస్ టాప‌ర్ జంట

2018లో దేశ వ్యాప్త దృష్టిని ఓ ఐఏఎస్ ప్రేమ జంట ఆక‌ట్టుకుంది. ఆ జంట తాజాగా విడిపోవ‌డంతో మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. వ్య‌క్తిగ‌త విభేదాల‌తో ఐఏఎస్ జంట విడిపోవ‌డంపై సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌కు దారి…

2018లో దేశ వ్యాప్త దృష్టిని ఓ ఐఏఎస్ ప్రేమ జంట ఆక‌ట్టుకుంది. ఆ జంట తాజాగా విడిపోవ‌డంతో మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. వ్య‌క్తిగ‌త విభేదాల‌తో ఐఏఎస్ జంట విడిపోవ‌డంపై సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌కు దారి తీసింది. రాజ‌స్థాన్‌లోని జైపూర్ ఫ్యామిటీ కోర్టు తాజాగా టీనా దాబి, అధ‌ర్ ఆమిర్‌ఖాన్ అనే ఐఏఎస్ టాప‌ర్ జంట‌కు విడాకులు మంజూరు చేసింది.

2015లో వెలువ‌డిన సివిల్స్ ఫ‌లితాల్లో టీనా దాబి, అధ‌ర్‌ల‌కు మొద‌టి, రెండో ర్యాంకులొచ్చాయి. టీనాది మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని భోపాల్‌. సివిల్స్ ఫ‌స్ట్ ర్యాంక్ సాధించిన ద‌ళిత యువ‌తిగా టీనా ప్ర‌శంస‌లు అందుకున్నారు. అధ‌ర్ ఆమిర్‌ఖాన్ స్వ‌స్థ‌లం జ‌మ్మూ క‌శ్మీర్‌. ట్రైనింగ్‌లో వీళ్లిద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ పెరిగి పెద్ద‌దై పెళ్లికి దారి తీసింది. 2018లో వీళ్లిద్ద‌రూ వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యారు. 

అప్ప‌ట్లో వీరి పెళ్లికి ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు, నాటి లోక్‌స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్‌తో పాటు ప‌లువురు కేంద్ర మంత్రులు కూడా హాజ‌ర‌య్యారు. వేర్వేరు మ‌తాల‌కు చెందిన వీళ్లిద్ద‌రి వివాహం అంద‌రినీ ఆక‌ర్షించింది.

తొలుత టీనా, అధర్‌ రాజస్థాన్ కేడ‌ర్‌లో జైపూర్‌లోనే విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం టీనా జైపూర్‌లోనే ఉన్నారు. అత‌ను మాత్రం విభేదాల‌తో భార్య‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ప్ర‌స్తుతం డెప్యు టేషన్‌పై తన సొంతరాష్ట్రమైన జమ్మూకశ్మీర్‌ వెళ్లి శ్రీనగర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. 

మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో రెండేళ్ల‌కే వివాహ బంధం విచ్ఛిన్న‌మైంది. పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకుని గతేడాది నవంబరులో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు విడాకులు మంజూరయ్యాయి. ఈ స‌మాచారం దేశ వ్యాప్తంగా వైర‌ల్ అవుతోంది.