తెలుగు మహిళా విభాగంతో జనాల్లోకి వెళ్లాలనుకుంటున్న చంద్రబాబు ప్లాన్స్ వర్కవుట్ కావడంలేదు. తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ప్రభావం అంతంతమాత్రంగానే ఉంటోంది.
జిల్లా కేంద్రాల్లో పెడుతున్న నారీ భేరీ దీక్షలకు జనం రావట్లేదు. మరోవైపు అనిత కోసం కావాలనే దివ్యవాణిని కాస్త తగ్గించారనే ఆరోపణలు వినపడుతున్నాయి. తెలుగు మహిళా విభాగంలో దివ్యవాణికి ప్రాముఖ్యత లేకుండా చేస్తున్నారని అనిత వ్యతిరేక వర్గం మండిపడుతోంది. తెలుగు మహిళల్లోనే ఇన్ని చీలికలు, పేలికలు ఉంటే.. ఇక పార్టీలో ఐకమత్యం ఎక్కడిది..?
గతంలో మహిళా విభాగానికి కీలక నేతలు బాధ్యులుగా ఉండేవారు. వారి సమన్వయంతో కార్యక్రమాలు బాగా జరిగేవి. ముఖ్యంగా డ్వాక్రా మహిళల్ని సమన్వయం చేసుకుంటూ ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా తెలుగు మహిళలు తరలి వచ్చేవారు. కానీ ఇప్పుడు టీడీపీలో మహిళా విభాగం బాగా నీరసించిపోయింది.
ఏపీలో జగన్ అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాల్లో మహిళలే కీలకంగా ఉంటున్నారు. అంటే మహిళలే ప్రథాన లబ్ధిదారులు. అలాంటి లబ్ధిదారులు ఎన్ని ప్రలోభాలు పెట్టినా టీడీపీ సభలకు, సమావేశాలకు వెళ్తారా. ఎంత టీడీపీపై అభిమానం ఉన్నా కూడా ప్రస్తుతానికి వారంతా జై జగనే అంటున్నారు. అలాంటి వారిని ఇటువైపు తీసుకు రావడం కాస్త కష్టమే.
అటు చంద్రబాబుకే ఏం చేయాలో తోచట్లేదు, ఇక టీడీపీ మహిళా విభాగం ఎన్ని కష్టాలు పడినా ఫలితం ఉంటుందా. అందులోనూ నాయకత్వం కోసం బీభత్సమైన వర్గపోరు జరుగుతోంది. దివ్యవాణిని కేవలం సోషల్ మీడియాలో పావుగా వాడుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.
వైసీపీ నుంచి ఎవరు చంద్రబాబుపై కామెంట్ చేసినా, చినబాబుని విమర్శలతో చీల్చి చెండాడినా వెంటనే యూట్యూబ్ లైవ్ లోకి వచ్చేస్తారు దివ్యవాణి. ఏవండోయ్ నానీగారూ అంటూ సినిమా స్టైల్ లో డైలాగులు పేలుస్తారు.
కాస్తో కూస్తో జనాల్ని ఆకట్టుకునే ప్రసంగాలు ఆమె నుంచే వస్తుంటాయి. అలాంటిది ఆమెను ఇప్పుడు పార్టీ పక్కనపెట్టింది. పోనీ దివ్యవాణి కూడా పూర్తిగా సైలెంట్ గా ఉన్నారా అంటే అదీ లేదు.
ప్రస్తుతం గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా కోసం ఆమె పోరాటం చేస్తున్నారు. ఇటు తెలుగు మహిళా విభాగంపై పూర్తి స్థాయిలో అనితకు అజమాయిషీ ఇచ్చారు. దీంతో వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చిందంటున్నాయి పార్టీ వర్గాలు.
అనిత ఓవర్ యాక్షన్ నచ్చనివారంతా ఆమె సభలకు వెళ్లడంలేదట. అందుకే నారీ భేరీ నీరసంగా సాగుతోందని తెలుస్తోంది.