అటు..ఇటు.. రాధా రాజకీయానికి దారెటు?

వంగవీటి రాధా ఆలోచన, ఆచరణ అస్సలు అంతుబట్టడంలేదు. ఆమధ్య తన హత్యకు రెక్కీ జరిగిందని బాంబు పేల్చారు. ప్రభుత్వం భద్రత పెంచితే వద్దన్నారు, అప్పటివరకూ చంద్రబాబుని ఆడిపోసుకున్నా ఆయనతోనే భేటీ అయ్యారు. తర్వాత వరుసగా…

వంగవీటి రాధా ఆలోచన, ఆచరణ అస్సలు అంతుబట్టడంలేదు. ఆమధ్య తన హత్యకు రెక్కీ జరిగిందని బాంబు పేల్చారు. ప్రభుత్వం భద్రత పెంచితే వద్దన్నారు, అప్పటివరకూ చంద్రబాబుని ఆడిపోసుకున్నా ఆయనతోనే భేటీ అయ్యారు. తర్వాత వరుసగా కాపు మీటింగ్ లకు హాజరవుతున్నారు. 

తాజాగా గుడివాడలో కాపు నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. బయట మీడియా అడిగితే మాత్రం స్నేహితుడి ఇంటికి టీ తాగడానికి వచ్చానన్నారు. ఇంతకీ రాధా రాజకీయం ఏ మలుపు తిరుగుతోంది.

వైసీపీ వైపు రావాలని ఉన్నా..?

గత ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన వంగవీటి రాధా చారిత్రక తప్పు చేశారు. ఆ తర్వాత దాన్ని సరిదిద్దుకున్నట్టే కనిపించారు. టీడీపీకి క్రమక్రమంగా దూరం జరిగారు. ఓ దశలో కొడాలి నాని, వల్లభవేని వంశీతో టచ్ లోకి రావడంతో.. వైసీపీలోకి వచ్చేయడమే తరువాయి అనే వార్తలొచ్చాయి. కానీ అంతలోనే చంద్రబాబు అలర్ట్ అయ్యారు. 

రాధాతో మీటింగ్ ఏర్పాటు చేశారు, వైసీపీ వర్గాలు సైలెంట్ అయ్యాయి. ఆ తర్వాత పలుమార్లు కాపు మీటింగ్ లలో రాధా కీలకంగా మారారు. ఏపీలో కాపులంతా ఒక్కటై 2024నాటికి బలమైన శక్తిగా ఎదగాలనే ఓ ప్రతిపాదన ఉంది. దాని ప్రకారం అందరూ కలుస్తున్నారు కానీ, కార్యాచరణ మాత్రం ప్రకటించడంలేదు.

లీడర్ ఎవరు..?

ఏపీలో కాపులకు లీడర్ ఎవరు. వైసీపీలో ఉన్న నేతలు, మంత్రులు కూడా కాపు నాయకుడు అనే ట్యాగ్ లైన్ కోరుకోవడంలేదు. ముద్రగడ పద్మనాభం గతంలోనే ఆ బరువు, బాధ్యతల్ని దించుకున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ లో ఊపు ఉన్నా… ఆయన కాపులకు నాయకుడు అనుకున్నా.. చివరకు మరో సామాజిక వర్గానికి దాసోహం అనాల్సిందే, ప్యాకేజీ పుచ్చుకోవాల్సిందే. 

అందుకే పవన్ కి క్రేజ్ ఉన్నా, నాయకుడిగా కాపు వర్గం గుర్తించడంలేదు. ఇక వంగవీటి రాధా.. తనకు తానే లీడ్ తీసుకోవాల్సిన దశలో ఎందుకో వెనకడుగు వేస్తున్నారు. వంగవీటి రంగా వారసుడిగా రాధాపై కాస్తో కూస్తో ఆ సామాజిక వర్గంలో సింపతీ ఉంది. కానీ మిగతా వర్గాలకు దగ్గరయ్యేంత కరిష్మా రాధాకు లేదు. దీంతో ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

కాపు మీటింగ్ లతో జరిగేదేంటి..?

అదిగో ఫలానా హోటల్ లో కాపుల మీటింగ్ జరిగింది, ఇదిగో ఫలానా చోట కాపులంతా రహస్యంగా సమావేశమయ్యారు. అదిగదిగో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతున్నారనే మాటలు వినపడుతున్నాయే కానీ, చేతల్లో మాత్రం ఏదీ కనపడ్డంలేదు.

రాధా కూడా తన వర్గం వారందర్నీ కలుస్తున్నారు, ఎంతోకొంత ప్రయత్నం మొదలు పెట్టారు. భవిష్యత్తులో ఆయన కచ్చితంగా టీడీపీ వైపు ఉండరని తేలిపోయింది. ఆ తర్వాత ఏంటనేదే తేలాల్సి ఉంది. అప్పటివరకూ ఈ మీటింగ్ లన్నిటికీ టీ పార్టీలంటూ పేరు పెట్టుకోవాల్సిందే.