ఒకప్పుడు తాము ఒక వెలుగు వెలిగిన రాష్ట్రాల్లో ఇప్పుడు పీసీసీ అధ్యక్షులుగా ఎవరిని నియమించుకోవాలో కూడా అర్థం లేని పరిస్థితుల్లో కనిపిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఏపీలో కాంగ్రెస్ గత వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి చోట గత ఎన్నికలు అయిపోగానే రఘువీర పీసీసీ పగ్గాలను వదలుకుంటే ఇటీవలే ఆ స్థానంలో శైలజానాథ్ ను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. అది కూడా ఉత్త ముచ్చటే. పెద్దగా ప్రయోజనం లేనట్టే.
ఇక తెలంగాణలో కూడా పీసీసీ అధ్యక్ష పదవి పంచాయతీ కొనసాగుతూ ఉంది. అక్కడ ఎవరిని ఆ హోదాలో నియమించాలో కాంగ్రెస్ హై కమాండ్ కే అర్థం అవుతున్నట్టుగా లేదు. ఏపీ మాదిరిగా తెలంగాణలో కాంగ్రెస్ కు నాయకుల కొరత లేదు. అయితే ఎవరికి ఆ పదవిని ఇచ్చినా మిగతా వాళ్లు సహకరించేలా లేరు. ఈ నేపథ్యంలో ఆ పంచాయతీ అలాగే పెండింగ్ లో ఉంది.
కానీ కర్ణాటకలో మాత్రం కాంగ్రెస్ పార్టీ గట్టి నిర్ణయాన్నే తీసుకున్నట్టుంది. అక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా డీకే శివకుమార ను నియమించాలని కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయించిందట. డీకేశి ఒక సమర్థవంతమైన కాంగ్రెస్ నేతగా పేరు తెచ్చుకున్నారు. సౌత్ లో కాంగ్రెస్ కు ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్నారు. ఇటీవలే ఆయన ఈడీ స్కానర్ కు కూడా వెళ్లొచ్చారు. అయితే డీకేని ఎక్కువ కాలం బంధించి ఉంచలేకపోయారు. కర్ణాటకలో రాజకీయంగా ప్రభావవంతమైన కులం వక్కలిగ(గౌడ) వర్గానికి చెందిన డీకే ఆర్థిక బలం లో కూడా తిరుగులేని వ్యక్తిగానే పేరు తెచ్చుకున్నారు. మరి డీకే నాయకత్వంలో కర్ణాటకలో కాంగ్రెస్ పునర్వైభవాన్ని పొందేనా?