ట్రంప్ అడ్డం తిరుగుతాడనే అంచనాలు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అధికార బదలాయింపు విషయంలో ట్రంప్ ప్రభుత్వం సహకారం అందిస్తూ ఉందని వార్తలు వస్తున్నాయి. అధికార మార్పిడిలో కీలక పాత్ర పోషించే జనరల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులకు సహకారం అందిస్తూ ఉందట ట్రంప్ ప్రభుత్వం.
ఈ నేపథ్యంలో అమెరికన్ రాజ్యాంగం పెట్టుకున్న ముహూర్తాల మేరకు అధికార బదిలీ జరగనుందని తెలుస్తోంది. నాలుగేళ్ల టర్మ్ ను ముగించుకుని వైట్ హౌస్ ను ఖాళీ చేసేందుకు ట్రంప్ రెడీ అవుతున్నట్టే అని వార్తలు వస్తున్నాయి. దీంతో కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ పదవీ బాధ్యతలు తీసుకోవడానికి లైన్ క్లియర్ అవుతున్నట్టే అని తెలుస్తోంది.
ఎన్నికల ప్రక్రియపై ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు ట్రంప్. రీ కౌంటింగ్ డిమాండ్లనూ చేశారు. జార్జియా రీ కౌంటింగ్ లో కూడా ఆయనకు ఓటమే తప్పలేదు. అలాగే ఎన్నికల ప్రక్రియపై అనుమానాలను వ్యక్తం చేస్తూ ఆయన కోర్టుల్లో దాఖలు చేసిన పిటిషన్లు కూడా తిరస్కరణకు గురయ్యాయి.
పోస్టల్ బ్యాలెట్ లను లెక్క పెట్టకూడదు అనే డిమాండ్ తో ఫెడరల్ కోర్టుల ముందు దాఖలైన పిటిషన్లూ కొట్టివేతకు గురవ్వక తప్పలేదు! దీంతో న్యాయపరంగా కూడా ట్రంప్ వాదనకు సహకారం అందే పరిస్థితి లేదనే క్లారిటీ వచ్చిన కొన్ని గంటల్లోనే ట్రంప్ తీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నట్టుగా ఉంది.
అధికార మార్పిడి విషయంలో ట్రంప్ నుంచి సహకారం అందుతూ ఉందని బైడెన్ బృందం ప్రకటించింది. ఇక బైడెన్ మరోసారి స్పందిస్తూ.. తను రెడ్ స్టేట్స్, బ్లూ స్టేట్స్ చూడనంటూ ప్రకటించుకున్నారు. తనకు అమెరికా మొత్తం సమానమే అన్నారు.
అధికార బదిలీకి సహకరిస్తూనే.. ఎన్నికల ప్రక్రియపై తమ పోరాటం కొనసాగుతుందని ట్రంప్ బృందం ప్రకటిస్తూ ఉంది. అయితే ఇప్పటికే కోర్టులు కూడా ట్రంప్ బృంద వాదనతో ఏకీభవించని నేపథ్యంలో.. అమెరికా ఎన్నికల తతంగానికి శుభం కార్డు పడినట్టే అని స్పష్టం అవుతూ ఉంది.