అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి విషాదం తర్వాత.. రెవెన్యూ ఉద్యోగులపై జనాల్లో ఎంత కోపం, ఎంత అసహనం, ఎంత అసహ్యం ఉందో బైటపడింది.
సోషల్ మీడియాలో బూతులు తిడుతున్నారే కానీ ఏ ఒక్కరూ పాపం ఎమ్మార్వో అన్న పాపాన పోలేదు. ఒకరిద్దరు అయ్యో పాపం అన్నా.. వారిని ట్రోలింగ్ చేస్తూ ఆటాడేసుకున్నారు మిగతావాళ్లు. ఆ తర్వాత కూడా ఏపీలో ఐదారు చోట్ల ఇలాంటి బెదిరింపు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా పెట్రోల్ సీసాలే ఎమ్మార్వో టేబుళ్లపై పెట్టిన ఉదాహరణలూ ఉన్నాయి.
ఈ ఘటనల తర్వాత రెవెన్యూ ఉద్యోగుల్లో ఒక రకమైన భయం ఏర్పడిందనే మాట మాత్రం వాస్తవం. ఆ వాస్తవం ఏపీలో జరిగిన రైతు భరోసా ప్రత్యేక స్పందన కార్యక్రమంలో కళ్లకు కట్టింది. రెవెన్యూ ఉద్యోగులంతా రైతుల పట్ల వినయ విధేయతలతో మెలగడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఎమ్మార్వోల దగ్గర్నుంచి, వీఆర్వోల వరకు రెవెన్యూ సిబ్బంది అంతా ఈ స్పందన కార్యక్రమంలో రైతులను మర్యాదగా పలకరించారు, సమస్యలన్నీ ఓపిగ్గా విన్నారు, రైతు భరోసా తప్పకుండా అందుతుందని భరోసా కల్పించి మరీ పంపించారు.
సహజంగా రెవెన్యూ ఉద్యోగులంటే రైతుల్ని కసురుకుంటారు, రేపు మాపు అంటూ తిప్పుకుంటారు, కచ్చితంగా చేయాల్సిన పనికి కూడా చేయి తడపాల్సిందేనంటారు. కానీ అబ్దుల్లాపూర్ మెట్ ఘటన తర్వాత మాత్రం మెల్లమెల్లగా ఉద్యోగుల్లో భయం పెరిగింది, దాంతోపాటు బాధ్యత కూడా గుర్తొచ్చినట్టుంది.
స్పెషల్ గ్రీవెన్స్ కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల తీరు చూసి రైతులే ఆశ్చర్యపోయారు. రైతు భరోసా కోసం గతంలో కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోని వీఆర్వోలు ఈరోజు పిలిచి మరీ సమస్యకు పరిష్కారం చెప్పే సరికి రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఎల్లకాలం ఎమ్మార్వో ఆఫీస్ లో వాళ్లంతా ఇలాగే ఉంటే బాగుంటుందని అనుకున్నారు బడుగు రైతులు. ఇప్పటి వరకూ రైతు భరోసా అందని లబ్ధిదారులు ఈనెల 15లోగా తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సి ఉండటంతో ప్రభుత్వం ఈ ప్రత్యేక స్పందన ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 2,85,469 ఫిర్యాదులందగా వాటిలో 1,38,868 ఫిర్యాదుల్ని అక్కడికక్కడే పరిష్కరించారు. మిగతా వాటి విషయంలో ప్రత్యామ్నాయాలను సూచించారు.
ఒక్క రోజులోనే ఇన్ని దరఖాస్తుల్ని పరిష్కరించిన రెవెన్యూ సిబ్బంది.. మిగతా రోజుల్లో కూడా ఇలాగే పనిచేస్తే ఇక రైతులకు సమస్యలెందుకుంటాయి. మార్పు మంచిదే కదా.