కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి శపథం చేశారు. జనసేనాని పవన్‌కల్యాణ్ అంటే ఆయన అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. పవన్‌కల్యాణ్‌ను ఈ దఫా మళ్లీ ఓడించే వరకూ వదిలి పెట్టే ప్రసక్తే లేదని ఆయన ప్రతినబూనారు. ఇటీవల జనసేన ఆవిర్భావ సభలో ద్వారంపూడికి పవన్‌కల్యాణ్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. భీమ్లానాయక్ ట్రీట్‌మెంట్ ఇస్తానని ద్వారంపూడిని పవన్ హెచ్చరించడం, దానిపై వైసీపీ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో విరుచుకుపడడం సీరియల్‌లా సాగుతోంది.
మూడు రోజుల క్రితం పవన్‌కల్యాణ్ వార్నింగ్‌పై ద్వారంపూడి స్పందిస్తూ తన వెంట్రుక కూడా పీకలేవని హెచ్చరించడం తెలిసిందే. ఇవాళ మరోసారి పవన్‌కల్యాణ్‌పై ద్వారంపూడి విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో పవన్‌కల్యాణ్ ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తామని ద్వారంపూడి చెప్పారు. పవన్ పోటీ చేసే నియోజకవర్గంలో తాను ఇన్‌చార్జ్ బాధ్యతలు తీసుకుంటానని ప్రకటించడం విశేషం.
పవన్ కల్యాణ్‌ను ఎలాగైనా ఓడిస్తానని ద్వారంపూడి శపథం చేశారు. పవన్‌కల్యాణ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఎమ్మెల్యే హితవు పలికారు. సభల్లో ఒక్కో ప్రత్యర్థి ఎమ్మెల్యే, మంత్రి పేరు ప్రస్తావిస్తూ హెచ్చరించడం పవన్‌కల్యాణ్‌కు పరిపాటైంది. జనసేనాని హెచ్చరికలతో ఆయన కార్యకర్తలు, అభిమానులు రెచ్చిపోవడం, దెబ్బలు తినడం అలవాటైంది.
పవన్ మాత్రం హాయిగా సినిమాలు తీసుకుంటూ బిజీ అయిపోతారు. ఆ తర్వాత మూడు నెలలకో, ఆరు నెలలో రాజకీయ తెరపై కాసేపు పూనకం వచ్చిన వాడిలా ఊగిపోతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఎల్లో మీడియా బ్యానర్ అవుతారు. అంతకు మించి పవన్‌కల్యాణ్ పొడిచేదేమీ లేదని గత 8 ఏళ్లుగా అందరూ అనుకునే మాట.