గత సార్వత్రిక ఎన్నికల ముందు తన రాజకీయ అవసరాలకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని టీడీపీ అధినేత చంద్రబాబు ఉపయోగించుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీ వ్యతిరేక పోరాటంలో తనను చంద్రబాబు బకరా చేశారని మమతాబెనర్జీ ఆవేదనకు లోనయ్యారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఘోర పరాజయం, అలాగే బీజేపీ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి రావడంతో చంద్రబాబు మౌనాన్ని ఆశ్రయించారు.
కానీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మాత్రం మోదీపై పోరాటాన్ని కొనసాగించారు. మోదీ నేతృత్వంలోని మోదీ సర్కార్ ఎన్నో ఇబ్బందులు పెట్టినా తిరిగి పశ్చిమబెంగాల్లో తన అధికారాన్ని నిలబెట్టుకున్నారు. బీజేపీని పశ్చిమబెంగాల్లో కట్టడి చేసి , అధికారాన్ని హస్తగతం చేసుకుని దేశ ప్రజల మెప్పు పొందారు.
2019లో అధికారం పోయిన తర్వాత మమతాబెనర్జీకి చంద్రబాబు దూరంగా ఉండడం మొదలు పెట్టారు. పలు దఫాలు మమతా ఫోన్ చేసినా, మాట్లాడేందుకు చంద్రబాబు నిరాకరించారు. బాబు మోసకారితనంపై సన్నిహితుల వద్ద మమత ఆవేదన వ్యక్తం చేసినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను చంద్రబాబు కొనుగోలు చేశారని మమతాబెనర్జీ సందర్భోచితంగా అన్నారో లేక ఉద్దేశ పూర్వకంగా అన్నారో తెలియదు. కానీ ఆమె ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.
అసలే చంద్రబాబు మోసకారి స్వభావం రీత్యా, పెగాసస్ సాఫ్ట్వేర్ కొనుగోలుపై సొంతవాళ్లు కూడా అనుమానించే పరిస్థితి. గతంలో తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని వైసీపీ ప్రతిపక్ష పార్టీగా పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే ఫిర్యాదులు కూడా చేసింది. ఇవాళ మమతాబెనర్జీ ఆరోపణలతో వైసీపీ నాటి ఫిర్యాదులకు విలువ వచ్చింది.
ఈ శతాబ్దంలోనే అతిపెద్ద స్కామ్‌గా చెబుతున్న పెగాసస్ వ్యవహారంలో చంద్రబాబు పాత్రపై రోజురోజుకూ అనుమానాలు బలపడుతున్నాయి. ఏది ఏమైనా తనకు చంద్రబాబు చేసిన మోసానికి మమత ప్రతీకారం తీర్చుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.