మంత్రి పదవి పోయినట్టేనా.. ముందస్తు సిగ్నల్స్?

మామూలుగా మంత్రి అనిల్ అవకాశం వస్తే ప్రతిపక్షాలపై విరుచుకుపడుతుంటారు. ఈరోజు మాత్రం అందుకూ పూర్తి భిన్నంగా మాట్లాడారు. నెల్లూరు బ్యారేజీ పరిశీలనకు వచ్చిన ఆయన కేవలం ప్రాజెక్ట్ పనులపై మాత్రమే స్పందించారు. మే నెలలో…

మామూలుగా మంత్రి అనిల్ అవకాశం వస్తే ప్రతిపక్షాలపై విరుచుకుపడుతుంటారు. ఈరోజు మాత్రం అందుకూ పూర్తి భిన్నంగా మాట్లాడారు. నెల్లూరు బ్యారేజీ పరిశీలనకు వచ్చిన ఆయన కేవలం ప్రాజెక్ట్ పనులపై మాత్రమే స్పందించారు. మే నెలలో సీఎం జగన్, బ్యారేజీ ప్రారంభోత్సవానికి వస్తారన్నారు. అదే రోజు సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరుతో నామకరణం చేసి జాతికి అంకితం చేస్తామన్నారు.

ఇలా కేవలం సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడారు. ప్రతిపక్షాలపై ఒక్క మాట తూలలేదు. అసలు ఆ ప్రస్తావనే లేదు. ఇదే రోజు నెల్లూరులో మత్స్యకార సదస్సు పెట్టింది టీడీపీ. పైగా కల్తీ మద్యంపై పోరాటం అంటూ రెచ్చిపోతోంది. కానీ మంత్రి అనిల్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. బహుశా మంత్రి పదవి విషయంలో చాలా మందికి ఈపాటికే సిగ్నల్స్ వచ్చేసినట్టున్నాయి. అందులో అనీల్ కూడా ఉన్నారేమో?

కానీ అనిల్ అంటే ఇది కాదు. తొడగొట్టాలన్నా, మీసం మెలేయాలన్నా, పవర్ ఫుల్ పంచ్ డైలాగ్ విసరాలన్నా.. అనిల్ తర్వాతే ఎవరైనా. కొడాలి నాని వాయిస్ లో కాస్త అభ్యంతరకరమైన పదాలు పడొచ్చు కానీ, అనిల్ పక్కా సెటైర్లతో విరుచుకుపడతారు. అనిల్ ప్రెస్ మీట్ అంటే ఆరోజు ఛానెల్స్ కి పండగే. అలాంటి అనిల్ సైలెంట్ అయిపోయారు. పూర్తిగా డల్ గా కనిపిస్తున్నారు. మంత్రి పదవి పోతోందనే ఆందోళన ఆయనలో స్పష్టంగా కనపడుతోంది.

అవకాశం వచ్చినా తన హయాంలో నెల్లూరు జిల్లాకు సంబంధించిన రెండు బ్యారేజీలూ పూర్తికాలేదనే ఆవేదన కూడా ఆయనలో కనపడుతోంది. బహుశా చివరి సారిగా ఆయన మంత్రి హోదాలో బ్యారేజీ పనులను పరిశీలించడానికి వచ్చి ఉండొచ్చు. అంతెందుకు.. అనిల్ తో పాటు చాలామంది మాజీలవ్వబోతున్న సందర్భం ఇది. ఒకరిద్దరు మినహా దాదాపుగా మంత్రులందరూ ఇలా దిగాలుగానే కనిపిస్తున్నారు.

లిస్ట్ బయటకొచ్చినట్టేనా..?

ప్రస్తుతానికి పెద్దిరెడ్డి, బొత్స, పేర్ని నాని, కొడాలి నాని.. పేర్లు సెకండ్ లిస్ట్ లో కూడా ఉంటాయని అంటున్నారు. వీరు కాకుండా.. మరో ఇద్దరు ముగ్గురు కూడా సామాజిక వర్గాల విషయంలో తమకు ప్రత్యామ్నాయం లేదని ధీమాగా ఉన్నారు. ఓసీలు, బీసీల విషయంలో మాత్రం జగన్ కు ఎక్కువ ఛాయిస్ ఉంటుంది. దీంతో ఆయా సామాజిక వర్గాల వారికి ముప్పు తప్పేలా లేదు. 

అందుకే మంత్రుల్లో మునుపటి హుషారు మాయమైంది. ఈ నీరసాన్ని ముందుగానే పసిగట్టిన సీఎం జగన్.. మాజీలందరికీ పార్టీ పదవులిస్తామన్నారు. కానీ అమాత్యులుగా తమ యోగం రెండున్నరేళ్లకే తీరిపోయే సరికి కొంతమంది లోలోపల కుమిలిపోతున్నట్టు కనిపిస్తోంది.