తనకు కుల ప్రయోజనాలే తప్ప కలం ప్రయోజనాలు పట్టవని ఈనాడు మరోసారి నిస్సిగ్గుగా చాటుకుంది. సమాజాన్ని చైతన్యపరచడంలో కలం అత్యంత శక్తిమంతమైంది. అందుకే కత్తి కంటే కలం గొప్పదని చెబుతారు. తాను రాస్తే తప్ప వార్త కాదని, జనానికి ఏదీ తెలియదని ఈనాడు పత్రిక ఇంకా భ్రమల్లో ఉన్నట్టుంది. అలాంటి భ్రమలు తొలిగించడంతో పాటు ఈనాడు దుర్మార్గాన్ని సోషల్ మీడియా మరోసారి ఏకిపారేస్తోంది.
జైభీమ్ సినిమా ఫేమ్ జస్టిస్ చంద్రు తాజాగా విజయవాడలో ఏపీలో న్యాయవ్యవస్థ విధానాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ చంద్రు వ్యాఖ్యలను ఈనాడు ప్రచురించకపోవడంతో నెటిజన్లు తమదైన రీతిలో దుమ్ము దులుపుతున్నారు.
తెలుగు మీడియా రంగంలో రామోజీరావు ఉద్ధండుడు. ఇందులో మరో మాటకే తావులేదు. కాలం గడిచేకొద్దీ ఆయన ప్రభ మసకబారుతోంది. రామోజీ నేతృత్వంలో నడిచే ఈనాడు రోజురోజుకూ పాతాళానికి పతనమవుతోంది. ఇక ఈనాడు పతనం కావడానికి పాతాళం అవతల ఏమైనా ఉంటే కూడా, దాన్ని దాటుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్టుంది. సమాచారం తెలుసుకోవడం ప్రతి ఒక్కరి హక్కు అంటూ సమాచార హక్కుపై జనాన్ని చైతన్యపరిచేందుకు ఈనాడు మీడియా ఒక ఉద్యమాన్నే నడిపింది. ఇది జనానికి ఎంతో ఉపయోగపడింది.
అయితే మార్గదర్శి ఆర్థిక అవకతవకలు తెరపైకి వచ్చినప్పుడు, కొన్ని అనుమానాలపై సమాచారం కావాలని నాటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సమాచార హక్కు చట్టం కింద అడిగితే… రామోజీ ఇవ్వనన్న విషయం అప్పట్లో తీవ్ర విమర్శలకు దారి తీసింది. తన నీతులు, రాతలు అన్నీ ఇతరులకే తప్ప, తనకు వర్తించవని రామోజీరావు బహిరంగంగానే నిరూపించుకున్నారు.
ప్రస్తుతానికి వస్తే ఈనాడు రాతల్లోని పక్షపాత వైఖరి, “పచ్చ”పాత బుద్ధి మరోసారి బట్టబయలైంది. తనకు నచ్చని వారిపై విషం చిమ్మడంలో ముందుండే ఈనాడు, నచ్చే వారి విషయంలో గోప్యత ఏ విధంగా పాటిస్తుందో మరోసారి బయట పడింది. తద్వారా ఈనాడు డొల్లతనం తెలుగు సమాజానికి తనకు తానుగా కళ్లకు కట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై న్యాయస్థానాలు సీరియస్ కామెంట్స్ చేస్తే… పతాక శీర్షికలు పెడుతూ ప్రభుత్వాన్ని బద్నాం చేయడాన్ని చూస్తున్నాం.
న్యాయస్థానాలు చేస్తున్నవే తాము హెడ్డింగ్లుగా పెడుతున్నామని ఈనాడు సమర్థించుకోవచ్చు. మరి ఇదే న్యాయ వ్యవస్థపై మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రు ఘాటు వ్యాఖ్యలు చేస్తే…అవి ఈనాడు పత్రికలో మచ్చుకైనా కనిపించలేదేం? విమర్శలకు న్యాయవ్యవస్థ ఏమైనా అతీతమా? లలేక తనకు తానుగా నిషేధాన్ని విధించుకుందా? అని పౌర సమాజం నిలదీస్తోంది. పాఠకులపై రామోజీకి, ఆయన నేతృత్వంలో నడుస్తున్న ఈనాడు పత్రికకి ఎంత గౌరవం ఉందో ఇదే నిలువెత్తు నిదర్శనమనే వ్యంగ్య కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అది కూడా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా విజయవాడలో పలు సమావేశాల్లో జస్టిస్ చంద్రు ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు, ఏపీ ప్రభుత్వం మధ్య ఘర్షణకు దారి తీసిన పరిస్థితులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికైన ప్రభుత్వాన్ని హైకోర్టు కార్నర్ చేస్తోందనే పెద్ద మాట ఆయన అనడం సహజంగానే తీవ్ర దుమారం రేపుతోంది.
జైభీమ్ సినిమా ఫేమ్‌గా జస్టిస్ చంద్రుకు దేశ వ్యాప్తంగా పాపులారిటీ వచ్చింది. ఆయన మాట్లాడే ప్రతి మాటకు ఎంతో గౌరవం. అందువల్లేనా ఆయన విమర్శలను లోకానికి తెలియజేయకుండా అడ్డుకోవాలని ఈనాడు ప్రయత్నం. సోషల్ మీడియా యుగంలో జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు లోకానికి తెలియనివ్వకూడదనే ఈనాడు కుట్రలు… అరచేతిని అడ్డుపెట్టి సూర్యభగవానుడి కిరణాలను అడ్డుకోవాలనే తలంపును గుర్తు చేస్తోంది.
న్యాయ వ్యవస్థలో ఓ రోల్ మోడల్‌గా నిలిచిన జస్టిస్ చంద్రు వ్యాఖ్యల గురించి తెలుసుకోవడం మానవ, పాఠక హక్కుగా ఈనాడు భావించడం లేదా? జస్టిస్ చంద్రు లాంటి నిరాడంబరుడు, నిజాయతీపరుడైన న్యాయకోవిదుడు మాట్లాడితే ప్రచురించే దమ్ము, ధైర్యం ఈనాడు ఎందుకు కోల్పోయిందో రామోజీరావు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇదే పత్రిక ఇవాళ మరో న్యాయమూర్తి ప్రవచనాలను మాత్రం ప్రధానంగా ప్రచురించడం చూడొచ్చు.
జనానికి కావాల్సింది నిప్పులాంటి నిజాలు. ఈనాడుకు సొంత ప్రయోజనాలే తప్ప, సామాజిక ప్రయోజనాలు ఎంత మాత్రం లేవని జస్టిస్ చంద్రు వార్తల ప్రచురణ నిరాకరణే తెలియజేస్తోంది. జస్టిస్ చంద్రుకు సంబంధించి కృష్ణా జిల్లా సంచికలో మానవ హక్కుల ఉల్లంఘనలు ఆపొచ్చు శీర్షికతో హైకోర్టుపై ఘాటు వ్యాఖ్యల ప్రస్తావనే లేకుండా ఎంతో జాగ్రత్తగా మిగిలిన సంగతులను రాయడాన్ని చూడొచ్చు.
జస్టిస్ చంద్రు వ్యాఖ్యలను ప్రచురించకుండా కొందరి మనసు రంజింప చేయొచ్చు. కానీ పాఠక దేవుళ్ల దృష్టిలో విలన్ అయ్యారనే సంగతిని రామోజీ, ఈనాడు గుర్తించుకుంటే మంచిది.