జ‌గ‌న్‌తో తాడోపేడో…కార్యాచ‌ర‌ణ రెడీ!

పీఆర్సీ విష‌యంలో తీవ్ర అన్యాయం జ‌రిగింద‌ని భావిస్తున్న ఉద్యోగులు…ప్ర‌భుత్వాధినేత‌తో క‌య్యానికే మొగ్గు చూపారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు వాళ్లు స‌న్న‌ద్ధ‌మ‌య్యారు. ఈ మేర‌కు ఉద్యోగ సంఘాల నేత‌లు జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై అంచెలంచెలుగా యుద్ధం…

పీఆర్సీ విష‌యంలో తీవ్ర అన్యాయం జ‌రిగింద‌ని భావిస్తున్న ఉద్యోగులు…ప్ర‌భుత్వాధినేత‌తో క‌య్యానికే మొగ్గు చూపారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు వాళ్లు స‌న్న‌ద్ధ‌మ‌య్యారు. ఈ మేర‌కు ఉద్యోగ సంఘాల నేత‌లు జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై అంచెలంచెలుగా యుద్ధం చేసేందుకు కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించ‌డం విశేషం.

మ‌రోవైపు ప్ర‌భుత్వం తాను తీసుకున్న నిర్ణ‌యంపై వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. అంతేకాదు, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అధ్య‌క్షత‌న ఇవాళ జ‌రిగిన కేబినెట్ భేటీలో నూత‌న పీఆర్సీ జీవోల‌ను య‌థాతథంగా అమ‌లు చేసేందుకు మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. దీంతో త‌న వైఖ‌రిని మ‌రోసారి ఉద్యోగుల‌కు వెన‌క్కి త‌గ్గేదే లేదు అని ప్ర‌భుత్వం తేల్చి చెప్పిన‌ట్టైంది.

ఉద్యోగులు కూడా అదే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ప్ర‌భుత్వం నూత‌నంగా తీసుకొచ్చిన పీఆర్సీని వ్య‌తిరేకిస్తూ శుక్ర‌వారం విజ‌య‌వాడ లోని ఎన్జీవో హోంలో ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ, సచివాలయ ఉద్యోగుల సంఘం, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్య‌క్ష‌, ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శులు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చించి కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.

ఫిబ్ర‌వ‌రి 5 నుంచి స‌హాయ నిరాక‌ర‌ణ‌, 7 నుంచి స‌మ్మెకు వెళ్లాల‌ని ఉద్యోగ సంఘాలు తీర్మానించాయి. అలాగే అంత‌కు ముందు ఉద్యోగుల‌ను ఉద్య‌మానికి సన్న‌ద్ధం చేసేందుకు వివిధ ద‌శ‌ల్లో ఉద్య‌మ నిర్మాణాన్ని చేప‌ట్టాల‌ని కూడా తీర్మానించ‌డం గ‌మ‌నార్హం. ఇందులో భాగంగా ఈ నెల 24న స‌మ్మె నోటీసు ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. ఇవాళ సీఎస్ స‌మీర్‌శ‌ర్మ‌ను క‌లిసి పాత జీతాలే ఇవ్వాల‌ని సంఘాల నాయ‌కులు కోర‌నున్నారు.

అలాగే ఈ నెల 23న అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ స‌మావేశాలు, 25న ర్యాలీలు, ధ‌ర్నాలు నిర్వ‌హించాల‌ని స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఈ నెల 26న అన్ని తాలూకా కేంద్రాల్లో అంబేద్క‌ర్ విగ్ర‌హాల‌కు విన‌తిప‌త్రాలు అంద‌జేయ‌డం. ఈ నెల 27 నుంచి 30వ తేదీ వ‌ర‌కూ అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార‌దీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ఉద్యోగ సంఘాల నాయ‌కులు తీర్మానించారు. ఫిబ్ర‌వ‌రి 3న చ‌లో విజ‌య‌వాడ నిర్వ‌హించాల‌ని ఏక‌గ్రీవంగా తీర్మానించ‌డంతో …ఉద్యోగుల ఉద్య‌మ‌బాట‌పై ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చింది.

ఉద్యోగుల వైపు స్ప‌ష్టంగా త‌మ‌కు ఉద్య‌మ‌మే ముద్దు…కొత్త పీఆర్సీ వ‌ద్దు అనే సంకేతాలు వెళ్లాయి. ఇక ప్ర‌భుత్వం తాను తీసుకున్న నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉండ‌డ‌మా లేక ఉద్యోగుల ఆందోళ‌న‌ల‌కు త‌లొగ్గ‌డ‌మా? …జ‌గ‌న్ ఎదుట రెండే ఆప్ష‌న్లు. ఇక నిర్ణ‌యం ఆయ‌న‌దే.