నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. రామోజీరావు మానసపుత్రిక ఈనాడులో “అభివృద్ధి వికేంద్రీకరణే మార్గం” శీర్షికతో ఏకంగా సంపాదకీయమే రాశారు. ఈ సంపాదకీయంలో మూడు రాజధానుల అంశాన్ని మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనలను, అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణ స్ఫూర్తిని ఈనాడు సంపాదకీయం ప్రతిబింబించింది. ఈ మాత్రం మార్పు ఆ పత్రికలో రావడం ఆనందమే.
భవిష్యత్‌లో జనాభా పెరుగుదల, పట్టణ, నగరీకరణ అంతకంతకూ పెరగడం, మరోవైపు పల్లెల్లో జీవించే వాళ్ల సంఖ్య తగ్గడంపై సంపాదకీయంలో ఆందోళన వ్యక్తమైంది. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ముందు చూపుతో రాసిన ఈ సంపాదకీయాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సిందే.
2011లో 121 కోట్లుగా ఉన్న దేశ జనాభా 2036నాటికి మరో పాతిక శాతం పెరిగి 152 కోట్లకు చేరుతుందని, అప్పటికి పట్టణవాసుల సంఖ్య 31.8నుంచి 38.2 శాతానికి పెరుగుతుందని జాతీయ జనాభా సంఘం సారథ్యంలోని సాంకేతిక బృందం తుది నివేదిక పేర్కొన్న విషయాన్ని తెలియజేశారు.
అలాగే 2036నాటికి కేరళ, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రల్లో నగరీకరణ 50శాతం మించిపోతుందని, ఆంధ్రప్రదేశ్‌లో 2011లో 30.6శాతంగా ఉన్న పట్టణ జనాభా అప్పటికి 42.8 శాతానికి చేరుతుందన్నది నివేదిక సారాంశమని సంపాదకీయంలో వెల్లడించారు. అంటే ఆంధ్రాకంటే తెలంగాణలోనే పట్టణీకరణ భారీగా పెరుగుతుందన్న మాట.
విద్య వైద్యం ఉపాధి వినోదం ఆర్థిక అవకాశాలు- ఈ అయిదూ పట్టణాలకు వలసల్ని పురిగొల్పుతున్నాయని గతంలో వెంకయ్య నాయుడు సూత్రీకరించారని, ఆయా అవకాశాల్ని పల్లెసీమలకు చేరువ చేస్తే నగరాలపై వలసల జనభారం తగ్గడమే కాదు- గ్రామాలు నవోత్తేజంతో కదం తొక్కుతాయనడంలో సందేహం లేదనేది ఈ సంపాదకీయం ప్రధాన ఉద్దేశం.
అలాగే యాభైనుంచి వంద గ్రామాలను ఒక సముదాయంగా తీర్చి, ఉమ్మడి వసతులు మార్కెట్లను ఏర్పాటు చేస్తే గ్రామీణ ప్రగతి ఊపందుకొంటుందని, రోడ్లు విద్యుత్ వంటి భౌతిక వసతులతోపాటు సాంకేతిక, విజ్ఞాన, ఆర్థిక వ్యవస్థలతో ఆ సముదాయాన్ని అనుసంధానిస్తే- పట్టణాలకు సరిసాటిగా అభివృద్ధి సాధ్యపడుతుందనీ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ఆకాంక్షించగా పేర్కొన్నారు.
“30 కిలోమీటర్ల చుట్టుకొలతతో రింగ్ రోడ్డు నిర్మించి సముదాయంలోని గ్రామాలన్నింటికీ రవాణా సౌకర్యం కల్పిస్తే- సమీప ప్రాంతాలకే వలసలు పరిమితమై పట్టణాలపై ఒత్తిడి తగ్గుతుందని, పల్లెల్లో ఆదాయవృద్ధి అభివృద్ధికి కొత్త గవాక్షాలు తెరుస్తుం దన్న మేలిమి సూచన అమలుకు సమయం మించిపోలేదు. నగరాలూ గ్రామాల సమీకృత ప్రగతే- ఆత్మనిర్భర్ భారత్‌కు వెన్నుదన్ను! “…ఇది ఈనాడు లేదా రామోజీరావు చెబుతున్న పరిష్కార మార్గం.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బలమైన ఆకాంక్ష కూడా ఇదే కదా. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని స్థాపించే లక్ష్యంతో వైఎస్ జగన్ అధికారం చేపట్టిన వెంటనే గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. ఏపీలోని ఈ వ్యవస్థ అందిస్తున్న సేవలు ఐక్యరాజ్య సమితి దృష్టికి కూడా వెళ్లాయని ఇటీవల మీడియా ద్వారా తెలుసుకున్నాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించి, వారికి సేవలందిస్తుండడం ఒక అద్భుతమే. ఈ వ్యవస్థే లేకపోతే కరోనా విపత్తును ఎదుర్కోవడంలో చాలా రాష్ట్రాల మాదిరిగానే ఏపీ కూడా విఫలమయ్యేదనే అభిప్రాయం లేకపోలేదు.
మూడు రాజధానుల కాన్సెప్ట్ కూడా అభివృద్ధి వికేంద్రీకరణ అనే ఆలోచన నుంచే ఆవిష్కృతమైంది. జగన్ నిర్ణయంతో కోస్తా ప్రాంతంతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు తప్పక అభివృద్ధి చెందుతాయి. దీన్ని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. రాష్ట్ర సంపదనంతా అమరావతిలో పెడితే….మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏమటన్న ప్రశ్నకు జవాబుగానే జగన్ మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే సదాశయంతో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చి అమలు చేయనున్నారు. కర్నూల్లో హైకోర్టు, విజయవాడ, విశాఖలలో బెంచీలు ఏర్పాటు చేయడం ద్వారా ఎక్కడికక్కడ న్యాయం పొందే వెసలుబాటు కల్పిస్తామని జగన్ ప్రభుత్వం చెబుతోంది.
అభివృద్ధి వికేంద్రీకరణపై సంపాదకీయం రాసిన ఈనాడు…ఆచరణకు వచ్చే సరికి అమరావతిలోనే రాజధాని కొనసాగించాలనే వితండ వాదం చేస్తూ, దాన్ని సమర్థించుకునేందుకు రకరకాల కథనాలు వండివార్చడం ఈనాడుకే చెల్లింది. ఈనాడు తాజా సంపాదకీయంలో పేర్కొన్నట్టు అన్ని ప్రాంతాలు అభివృద్ధిని వికేంద్రీకరిస్తేనే ఆత్బ నిర్భర భారత్‌కు వెన్నుదన్ను.
అలాగే ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేసి అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ చేస్తేనే ఆత్మనిర్భర ఆంధ్రప్రదేశ్‌కు వెన్నుదన్ను అని చెప్పక తప్పదు. ఆ దిశగా ప్రభుత్వానికి సహకరించేలా ఈనాడు సహకరించకపోయినా…కనీసం హాని కలిగించేలా వ్యవహరించకపోతే అదే పదివేలు.