కరోనా సమయంలో ఇంటికే పరిమితమైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ట్వీట్లతో జనాన్ని చావబాదుతున్నారు. ఈ ట్వీట్ల ప్రమాదం నుంచి తప్పించుకోడానికైనా కరోనా వైరస్‌ను తరిమికొట్టాల్సిందే. చీమ చిటుక్కుమన్నా జగన్‌రెడ్డే కారణమంటూ ట్విటర్‌లో గయ్ గయ్‌మని లోకేశ్ లేస్తున్నారు.
కడప సెంట్రల్ జైల్లో ఉన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి కరోనా బారిన పడడానికి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగనే కారణమంటే రాజకీయ విమర్శ అనుకోవచ్చు. జగన్‌రెడ్డి నేర మనస్తత్వమే అనడం లోకేశ్ అవులెయ్‌కి పరాకాష్ట. అవులెయ్ అంటే రాయలసీమలో తమాషా అని అర్థం. ఇంగ్లీష్‌లోనైతే కామెడీ. లోకేశ్ రాయలసీమ బిడ్డ కదా! అందుకే ఆయన యాసలోనే చెప్పుకుందాం. టీడీపీని నామరూపాలు లేకుండా చేసిన జగన్ అంటే అబ్బాకొడుకులిద్దరూ అసలు జీర్ణించుకోలేకున్నారు.
అందుకే ఏపీలో ప్రతి సంఘటనకు జగన్‌ను ముడిపెట్టి పబ్బం గడుపుకోవడం బాబు, లోకేశ్‌లకు అలవాటైంది. జనాన్ని గాలికొదిలేసి నెలలవుతోంది. సోషల్ మీడియా, మీడియాను పట్టుకుని ఊగులాడుతూ ఏదో చేయాలనే తపన తప్ప…జనానికి ప్రయోజనం కలిగించే ఒక్క మాట మాట్లాడితే ఒట్టు.
లోకేశ్ తాజా ట్వీట్‌లో చెప్పిందే చెబుతూ…ఏ మాత్రం కొత్తదనం లేకుండా నెటిజన్లను విసిగిస్తున్నారు. జగన్ ఒక్క ఛాన్స్ అడిగింది ప్రజల కోసం కాదని…కక్ష సాధింపుల కోసమంటూ చెప్పుకొచ్చారు. వ్యక్తిగత కక్ష సాధింపుతోనే జేసీ కుటుంబంపై అక్రమ కేసులు బనాయించారని లోకేశ్ మరోసారి విమర్శించారు. ఒక పక్క కరోనా, మరో పక్క వరదలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వారిని గాలికొదిలి ప్రతిపక్ష నేతల అక్రమ అరెస్టులకు ప్రణాళిక సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారని మండిపడ్డారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి బెయిల్‌పై విడుదలైన 24 గంటల్లోనే కరోనా కేసు అంటూ మళ్ళీ అరెస్ట్ చేశారని లోకేశ్ చెప్పడం విడ్డూరంగా ఉంది. దళిత సీఐని దూషించిన కేసులో ఆయన్ను అరెస్ట్ చేయడం లోకమందరికి తెలుసు. నడిరోడ్డుపై సీఐ మీదికి దూకుడుగా వెళ్లడం వీడియోల్లో రికార్డు అయింది. అయినా వాస్తవాలు లోకేశ్‌కు పట్టవు. పొంతన లేని ప్రకటనలతో లోకేశ్ కడుపుబ్బ నవ్విస్తున్నాడు. స్థాయికి తగ్గట్టు నడుచుకోవడం బహుశా ఆయనకు గోత్రం ఉన్నట్టుంది. ఏది ఏతైనేం లోకేశ్ బాగా జోకుతున్నాడబ్బా!