ప్రతిష్టాత్మకంగా జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ రౌండ్‌రౌండ్‌కూ ఉత్కంఠ రేపుతోంది. ప్రతి రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యత కనబరుస్తున్నారు. అయితే పెద్ద మెజార్టీ కాకపోవడం, ఇంకా సగం ఓట్లు లెక్కించాల్సి వుండడంతో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి.
ఇదిలా ఉండగా ఈటల రాజేందర్ తన ప్రధాన ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ స్వగ్రామంలో మెజార్టీ సాధించడాన్ని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గెల్లు శ్రీనివాస్ స్వస్థలం వీణవంక మండలం హిమ్మత్‌నగర్. ఈ గ్రామంలో గెల్లు శ్రీనివాస్ కంటే ఈటల రాజేందర్‌కు 191 ఓట్ల మెజార్టీ దక్కడం విశేషం.
ఒకవైపు ఈటల గెలుపు బాటలో పయనిస్తుంటే, మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ తన స్వగ్రామంలో కూడా ప్రజాదరణ పొందలేకపోవడం ఆశ్చర్యంగా ఉందని నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు.
హుజూరాబాద్‌లో ప్రధానంగా ఈటల రాజేందర్, ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యే పోటీ జరిగిందని వివిధ రాజకీయ పక్షాలు చెబుతున్నాయి. ఇది బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పోటీ అనేకంటే… ఆత్మగౌరవం, అహంకారం మధ్య సాగిన పోరుగా అభివర్ణిస్తున్నారు. చివరికి ఆత్మగౌరవానికే ప్రజలు పట్టం కడుతున్నారనే చర్చ జరుగుతోంది.