కశ్మీర్ భారత అంతర్గతమైన అంశం. అక్కడ సమస్యలే వస్తాయో, సఖ్యతే ఉంటుందో.. అది భారత అంతర్గత విషయం. ఈ విషయంలో ఇతర దేశాల ప్రమేయం కానీ, వారి తీర్పులు కానీ అవసరం లేదు. ఇదీ మొదటి నుంచి భారత విధానం. మన్మోహన్ సర్కారు ఉన్నప్పుడు అయినా, అంతకు ముందు అయినా.. ఇదే విషయాన్నే చెబుతూ వచ్చింది భారత ప్రభుత్వం. ఈ విషయాన్ని ఎంతమంది మోడీ భక్తులు ఒప్పుకుంటారో తెలీదు.
కాంగ్రెస్ హయాంలో కూడా కశ్మీర్ భారత అంతర్గత అంశంగానే నిలిచింది.అది మోడీ వచ్చాకా మొదలైన విధానం కాదు. అయితే ఇప్పుడు భారత అంతర్గత విధానంలోకి విదేశీయుల సర్టికేషన్ అవసరం ఎందుకు వచ్చింది? కశ్మీర్ లో యూరోపియన్ యూనియన్ ఎంపీలు ఎందుకు పర్యటిస్తున్నారు? వారు ఎవరికో ఎందుకు నివేదికను ఇస్తున్నారు? అనేది మోడీ ప్రభుత్వం స్పందించాల్సిన అంశం!
మొన్నటి వరకూ కశ్మీర్ భారత అంతర్గత అంశమంటూ భారతీయులు అంతర్జాతీయ వేదికల మీద కూడా గట్టిగా వాదించారు. అయితే ఆ వాదనకు ఇప్పుడు ఇండియానే విలువను ఇవ్వనట్టుగా తయారైంది. ఆర్టికల్ త్రీ సెవెన్టీని రద్దుచేసి తాము ఘనకార్యం చేసినట్టుగా మోడీ ప్రకటించుకుంటూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో నెలలు గడుస్తున్నా కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు ఏర్పడటం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో అక్కడ సాధారణ పరిస్థితులు ఉన్నాయని మోడీ సర్కారు నిరూపించుకోవాల్సి వస్తోంది! దీనికిగానూ విదేయుల సర్టిఫికెట్ అవసరం అవుతోంది!
ఇదీ కథ. మోడీ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు కశ్మీర్ లో విదేశీయుల అధికారిక పర్యటనలు మొదలయ్యాయి. వారి వారి హోదాలతో వారు అక్కడ తిరుగుతారు. తమకు తోచిన నివేదికను వారు ఇవ్వొచ్చు. అయితే వీళ్లంతా వలసవాద విధానాలకు వ్యతిరేకులే అని భారత ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా నివేదికను ఇచ్చేవారినే సెలెక్ట్ చేశారనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. అయినా ఇలా మేనేజ్ చేయాల్సిన పని ఎందుకు వచ్చింది?
కశ్మీర్ లో మూడోవ్యక్తి జోక్యాన్ని భారత ప్రభుత్వమే ఎందుకు ఆహ్వానించాల్సి వచ్చింది? ఇన్నేళ్లలో ఎన్నడూ లేనిది ఇప్పుడెందుకు? ఇది ఇంకా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అనే అంశాల గురించి నిస్పాక్షికంగా, వీర జాతీయవాద కళ్లద్దాలు తీసి ఆలోచిస్తే.. ఆర్టికల్ త్రీ సెవెన్టీ రద్దు ఇంకా ఎలాంటి పరిణామాలకు దారి తీయబోతోందో స్పష్టం అవుతుంది. అయినా కశ్మీర్ లో భారత ఎంపీల పర్యటనలను నిరోధిస్తూ.. విదేశీ ఎంపీలకు రెడ్ కార్పేట్లు వేయడం ఏమిటో మరి!