వైసీపీ అధికారంలోకి వచ్చాక తొలిసారి పవన్ రోడ్డెక్కుతున్నారు. వైజాగ్ లో భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా భారీ ర్యాలీ చేపట్టబోతున్నారు. పవన్ కల్యాణ్ పేరు చెబితే ఊగిపోయే అభిమానులంతా ఈ ర్యాలీకి తరలివస్తారని, భవన నిర్మాణ కార్మికులు కూడా పనులు ఆపేసుకుని తమ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా వేశారు పవన్ కల్యాణ్. కానీ రోజులు దగ్గరపడే కొద్దీ ఆ అంచనాలు తలకిందులవుతున్నాయి. ఎక్కడో అనుమానం మొదలైంది.
టీడీపీ దుష్ప్రచారం చేస్తున్నట్టు రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులెవరూ ఇసుక కొరత వల్ల ఖాళీగా లేరు. అలాగని వారంతా పవన్ కి మద్దతిస్తారని కూడా చెప్పలేం. వైసీపీ జమానా కాబట్టి ఎక్కడికక్కడ పోలీసులు, కాస్త నట్టు బిగిస్తే.. జన సమీకరణ కూడా కష్టమే. అందుకే వైజాగ్ నిరసన ప్రదర్శన విషయంలో కిందామీదా అవుతున్నారు పవన్ కల్యాణ్.
ప్రభుత్వం మీద తాను ఎగిరెగిరి పడుతున్న రేంజ్ లో తన నిరసన కార్యక్రమానికి జనం రాకపోతే, అది వెలవెలపోతే పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నారు. దీనిపై ఇప్పటికే అన్ని పార్టీలకు లేఖలు రాసి, మద్దతు తెలపాలని ప్రాధేయపడుతున్నారు పవన్ కల్యాణ్. వామపక్షాలు ఎలాగూ మీదీ మాదీ ఎర్ర తుండే అనే నినాదంలో ఉన్నాయి. బీజేపీ అధిష్టానం నుంచి కూడా పవన్ కి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇస్తామంటూ స్పష్టమైన సంకేతాలు పంపించింది.
టీడీపీ మాత్రం ఈ నిరసనలో కలిసేందుకు ఇష్టపడటం లేదు. పవన్ తెరపైకి వస్తే అయితే తమకు మైలేజీ పడిపోతుందనేది చంద్రబాబు భయం. ఇన్నాళ్లూ ఆడిన డ్రామాలకు ఉపయోగం లేకుండా పోతుందని బాధ. కానీ పవన్ మాత్రం బహిరంగ లేఖలు రాస్తూ ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా జరిగే ఈ ర్యాలీలో అన్ని రాజకీయ పార్టీలు కలసి రావాలంటూ లేఖాస్త్రాలు సంధిస్తున్నారు.
మొత్తమ్మీద పవన్ కల్యాణ్ మాత్రం తన నిరసన కార్యక్రమంపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. సేకరించినా, సమీకరించినా, కూలీకి తీసుకొచ్చినా… ఓవరాల్ గా ఎంతమంది జనం వస్తే నిరసన అంత సక్సెస్ అయినట్టు లెక్క. అందుకే పవన్ కల్యాణ్ జనసమీకరణ కోసం తమ పార్టీ నాయకులపై ఒత్తిడి తెస్తున్నారు. మద్దతివ్వాలంటూ ఇతర పార్టీలను ప్రాధేయపడుతున్నారు.