హుజూర్ నగర్ గెలుపుని అడ్డుగా పెట్టుకుని ఆర్టీసీ సమ్మెపై ఎంత ఓవర్ గా రియాక్ట్ అవ్వాలో, అంత ఓవర్ గా పెట్రేగిపోయారు కేసీఆర్. ఆ ఓవరాక్షన్ కి ప్రతిపక్షాలు బెదిరిపోయాయేమో కానీ, కార్మిక సంఘాలు మాత్రం మరింత రెట్టించి ఉద్యమిస్తున్నాయి. పెయిడ్ ఆర్టిస్ట్ తో యూనియన్ నాయకుడు అశ్వత్థామరెడ్డిపై కేసు పెట్టించి, దాన్ని తమ అనుకూల మీడియాతో రాష్ట్రవ్యాప్తంగా రాద్ధాంతం చేయాలని చూసినా కుదరలేదు. ఇప్పుడు హైకోర్టు చేతిలో పూర్తిగా కార్నర్ అయ్యారు కేసీఆర్.
కేసీఆర్ ని నేరుగా తిట్టకుండా.. అధికారుల్ని చెడామడా వాయించేస్తోంది హైకోర్టు. కేసీఆర్ చెబుతున్న కాకి లెక్కలకు వివరాలు అడుగుతోంది. అంతిచ్చాం, ఇంతిచ్చాం అంటున్నారు.. ఎవరికిచ్చారు, ఎందుకిచ్చారు, హుజూర్ నగర్ కి 100కోట్లు ఇచ్చినవాళ్లు, రాష్ట్రవ్యాప్త సమస్య కోసం 47కోట్లు ఖర్చు చేయలేరా అని కోర్టు ప్రశ్నించిందంటే.. ఈ విషయంలో న్యాయమూర్తులు ఎంత స్పష్టంగా ఉన్నారో అర్థమవుతోంది.
కేసీఆర్ చేసింది, చేస్తోంది ముమ్మాటికీ తప్పేనన్న రీతిలో స్పందించింది హైకోర్టు. తాజాగా సకల జనుల సమరభేరి సభను అడ్డుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. కోర్టు అనుమతివ్వడం కొసమెరుపు. ఈ సభలో గొడవలు సృష్టించి కార్మికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలన్న కుట్ర కూడా జరుగుతోందని సమాచారం. అయినా సరే కేసీఆర్ ని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించే వరకు తాము వెనక్కి తగ్గేది లేదంటూ కార్మిక నాయకులు పట్టుబట్టి కూర్చున్నారు.
ఇదిలా ఉంటే.. ఆర్టీసీ కార్మికులకు పోలీసుల మద్దతు కూడా ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకుని షాకయ్యారు కేసీఆర్. ఇన్నిరోజులుగా సమ్మె విజయవంతంగా కొనసాగడానికి పోలీసుల మద్దతు కూడా పరోక్ష కారణం అట. అద్దెబస్సుల్ని తిప్పాలనుకున్నా, తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకున్నా ఆర్టీసీ బస్సుల్ని రోడ్డెక్కించాలని చూసినా ఏదీ పూర్తిగా సక్సెస్ కావడం లేదు. ప్రతి బస్సుకీ ఓ పోలీస్ ని బందోబస్తుగా పెట్టి బస్సులు నడపాలని చూస్తున్నారు కేసీఆర్. అయినా సరే డిపోలనుంచి బస్సులు బైటకు రాకుండా కార్మికులు అడ్డుకుంటున్నారు.
రాష్ట్ర విభజన జరిగిన సమయంలో తెలంగాణ పోలీసులు ఉద్యమకారులపై ఎలా ఉదారంగా ఉన్నారో.. ఇప్పుడు కూడా కార్మికులపై అంతే సింపతీ చూపిస్తున్నారు. ఇప్పటి వరకూ జరిగిన నిరసన ప్రదర్శనలు కూడా అందుకే విజయవంతం అయ్యాయని కేసీఆర్ కి రిపోర్ట్ అందింది. సో.. కేసీఆర్ పై ముప్పేట దాడి జరుగుతోందనేది మాత్రం వాస్తవం. అటు కార్మికులు, ఇటు ప్రతిపక్షాలు, పైన కోర్టు అక్షింతలు.. అన్నిటికీ తోడు.. పోలీసుల సహాయ నిరాకరణ కూడా కేసీఆర్ ని ఒంటరిని చేస్తోంది.
ఆయన నియంతృత్వానికి భయపడే పార్టీ నేతలు మాత్రం కేసీఆర్ ఏది చెప్పినా తలాడిస్తున్నారు కానీ, టీఆర్ఎస్ నాయకులెవరికీ కూడా సమ్మె జరగడం ఇష్టం లేదట. కార్మికుల కష్టాలు తమకూ తెలుసంటూ తమ నిస్సహాయతను వారి వద్ద వ్యక్తం చేస్తున్నారు కొంతమంది మంత్రులు, నేతలు.