ఒకప్పుడు నాయకులు పార్టీ మారడానికి చాలా బలమైన కారణాలు ఉండేవి. ఆ రోజుల్లో సిద్ధాంతాల పైన రాద్ధాంతాల వల్ల, విధానాల మీద అభిప్రాయం భేదాలో వచ్చి నాయకులు వేరే పార్టీలోకి వెళ్లేవారు. కొందరు నాయకులు తాము ఉన్న పార్టీలో ఎన్ని అవమానాలు జరిగినా, పదవులు రాకపోయినా జీవితాంతం అంటిపెట్టుకొని ఉండేవారు.
ఒకసారి ఒక సిద్ధాంతాన్ని నమ్మిన తరువాత ఏం జరిగినా దానికే కట్టుబడి ఉండాలని అనుకునేవారు. జీవితాంతం ఒక్కటే మాట్లాడాలనేది ఒక కట్టుబాటుగా పెట్టుకునేవారు. ఇక విభేదాలతో పార్టీ మారేవారు మరికొందరు ఉండేవారు. కానీ ఇప్పటిమాదిరిగా స్వప్రయోజనాల కోసం, స్వార్థం కోసం పార్టీ మారేవారు కాదు. పార్టీ మారినప్పుడు ప్రజలకు సరైన సమాధానం చెప్పుకోవాలనే ఒక విధమైన భయం ఉండేది.
ఉదాహరణకు …పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ పార్టీలో చాలా అవమానాలు జరిగాయి. కానీ పార్టీ మారాలనే ఆలోచన చేయలేదు. కమ్యూనిస్టు పార్టీ దిగ్గజం పుచ్చలపల్లి సుందరయ్య కూడా ఇదే టైపు. ఇలాంటివారు ఎంతోమంది మన రాజకీయాల్లో ఉన్నారు. కానీ ఇప్పటి రాజకీయ నాయకులు పూర్తిగా స్వప్రయోజనాల కోసం పార్టీలు మారుతున్నారు తప్ప బలమైన కారణాలు ఏమీలేవు. దమ్మున్నవారు సొంత పార్టీ పెట్టుకుంటున్నారు.
ఇప్పటి నాయకులు ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థం కాదు. వారు సోయి ఉండి మాట్లాడుతున్నారో, లేకుండా మాట్లాడుతున్నారో తెలియదు. ఎన్ని పదవులు అనుభవించినా తృప్తి ఉండదు. ఇలాంటి నాయకులంతా ఎదుటివారికి నీతులు చెబుతుంటారు. వారిని ద్రోహులని విమర్శిస్తుంటారు. నిన్న మొన్న టీడీపీని వదిలి గులాబీ కండువా కప్పుకున్న ఎల్ రమణ సోయి లేకుండా మాట్లాడుతున్నాడు .
ఆయన మాటలని విని నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. ఈటల పార్టీ మారి, టీఆర్ఎస్‌కు ద్రోహం చేశాడట. రమణ తాను టీఆర్ఎస్ లో పుట్టి పెరిగినట్లు మాట్లాడుతున్నాడు. ఈటల టీఆర్ఎస్‌కు ద్రోహం చేస్తే.. టీటీడీపీకి ఎల్. రమణ చేసిన దాన్ని ఏమంటారు ? పదవి కోసం ఆశపడి గులాబీ పార్టీలోకి వెళ్లిన రమణ సుద్దులు చెప్పడం ఆశ్చర్యంగా ఉంది.
ఈటల టీఆర్ఎస్ నుంచి ఎందుకు బయటకు వచ్చాడో ప్రపంచమంతా తెలుసు. కానీ రమణ టీడీపీ నుంచి ఎందుకు బయటకు వచ్చాడు? చెప్పగలడా ? పదవి ఆశ చూపితే వచ్చాను అని ధైర్యంగా చెప్పగలడా ? గులాబీ పార్టీలో చేరినవారు చెప్పే సమాధానం ఒక్కటే. కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితుడనై వచ్చానని, అభివృద్ధిలో భాగస్వామిని కావాలని వచ్చానని చెబుతారు. దానికి రమణ మినహాయింపు కాదు. ఈటల టీఆర్ఎస్ కు ద్రోహం చేస్తే తానూ టీడీపీకి ద్రోహం చేసాడు కదా.
అసలు ఈటలే గనుక టీఆర్ఎస్ లో కొనసాగి ఉంటే.. ఎల్. రమణ ఇప్పుడు ఎక్కడ ఉండేవాడు. కేసీఆర్ తన రాజకీయ ప్రయోజనాల కోసం రమణను పట్టుకొచ్చాడు. రమణ కూడా పదవి కోసం ఆశపడ్డాడు. చంద్రబాబు రమణను అవమానించలేదు. ప్రాధాన్యం ఇవ్వకుండా పక్కన పెట్టలేదు. రెండుసార్లు పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టాడు బాబు. రమణ సమర్ధుడు కాడనే అభిప్రాయం ఉన్నా సామాజిక వర్గం కోణంలో పదవి ఇచ్చాడు.
టీడీపీ అధికారంలో ఉండగా ఎమ్మెల్యే అయ్యాడు. ఎంపీ అయ్యాడు. మంత్రి అయ్యాడు. టీడీపీలో రమణకు ఎలాంటి అన్యాయం జరగలేదు. కానీ పార్టీని వదిలేసి ద్రోహం చేశాడు. సరే… పార్టీలో చేరాక యేవో విమర్శలు చేసి కేసీఆర్ దృష్టిలో పడాలి కదా. అందుకే ఈటలను ద్రోహి అన్నాడు. ప్రస్తుతం టీఆర్ఎస్ నాయకులంతా ఈటలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు.
పార్టీలు మారేవారు ద్రోహులని చెప్పుకుంటే ఆ జాబితాలో కేసీఆర్, చంద్రబాబు, జగన్ కూడా ఉంటారు ఆ లెక్కన చూసుకుంటే ఇప్పటి రాజకీయ నాయకులంతా (ఎవరో కొద్దిమంది మినహాయించి ) ద్రోహులని చెప్పుకోవచ్చు.