బీజేపీ తప్ప అంతా ఒక్కటిగా…?

పాపం బీజేపీ ఏపీలో ఒంటరి అయిపోయింది. ఆ పార్టీని పక్కన పెట్టి అంతా ఒక్కటి అయ్యారు. అది కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పెద్ద ఎత్తున…

పాపం బీజేపీ ఏపీలో ఒంటరి అయిపోయింది. ఆ పార్టీని పక్కన పెట్టి అంతా ఒక్కటి అయ్యారు. అది కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పెద్ద ఎత్తున పోరాటం ఏపీలో జరుగుతోంది. మరో వైపు కేంద్రం తమ మాటే నెగ్గించుకోవాలని చూస్తోంది.

దీంతో ఒళ్ళు మండిన ఉక్కు కార్మికులు విశాఖ బంద్ కి పిలుపు ఇచ్చారు. ఈ నెల 28న స్మార్ట్ సిటీలో పెద్ద ఎత్తున బంద్ సాగనుంది. ఈ బంద్ కి బీజేపీ తప్ప మిగిలిన రాజకీయ పార్టీలు అన్నీ మద్దతు తెలిపాయి. అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం, బీజేపీ మిత్ర పక్షం జనసేన కూడా స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే ఉండాలని  కోరుకుంటున్నాయి.

దాంతో విశాఖ బంద్ ఈసారి గట్టిగా జరిగే అవకాశం ఉంది. బంద్ నకు సహకరించేందుకు ప్రజా సంఘాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. దాంతో కనీసం కొన్ని గంటల పాటు అయినా బంద్ విశాఖలో సాఫీగా జరిగే సీన్ అయితే ఉంది.

మరి విశాఖ బంద్ కనుక గ్రాండ్ సక్సెస్ అయితే దాన్ని చూసి అయినా కేంద్ర పెద్దల మనసు మారుతుందా అంటే అది చూడాలి. ఏది ఏమైనా ఒక కామన్ కాజ్ విషయంలో ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు బీజేపీకి యాంటీగా జెండా ఎత్తడం మాత్రం వర్తమాన రాజకీయాల్లో చెప్పుకోదగిన విషయంగానే చూడాలి.